లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం 13 మంది ప్రాణాలను తీసింది

మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొనడంతో 13 మంది చనిపోయారు. మృతి చెందిన వారంతా వ్యవసాయ కూలీలే. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం, అతి వేగమే.. ఈ ప్రమాదానికి కారణమంటున్నారు పోలీసులు.

ఈ దుర్ఘటనలో ... మొత్తం 13 మంది చనిపోగా.... మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కొత్తపల్లి గ్రామానికి చెందిన కూలీలు శివారులోని వ్యవసాయ పొలాల్లో పని చేసి ఆటోలో తిరిగి వెళ్తున్నారు. మిడ్జిల్‌ సమీపంలో కోదాడ వైపు వెళ్తున్న లారీ వీరి ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న 18 మందిలో 12 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి..ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జైంది. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయి... హృదయవిదారకంగా ఉంది ఆ ప్రాంతం. మృతులంతా ... భోగ్య తాండా వాసులుగా గుర్తించారు పోలీసులు. క్షతగాత్రుల్ని స్థానికులు సాయంతో ఆస్పత్రికి తరలించారు.

మరోవైపు.. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందించినా.. 108 వాహనం ఆలస్యంగా వచ్చిందని స్థానికులు ఆగ్రహానికి గురయ్యారు. 108 వాహనంపై దాడి చేశారు. ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. అటు.. గాయపడ్డవారికి ఆస్పత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. గతంలోనూ ఇదే ప్రాంతంలో అనేక ప్రమాదాలు జరిగినా అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు. ప్రమాద స్థలిలో ధర్నాకు దిగారు కొత్త పల్లి వాసులు. జడ్చర్ల నుంచి కల్వకుర్తి వెళ్లే రోడ్డుపై బైఠాయించారు. మలుపు వద్ద.. ఎదురుగా వచ్చే వాహనాలు గుర్తించే పరిస్థితి లేకపోవడం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఈ దుర్ఘటన పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మెరుగైన వైద్యం అందించాలంటూ... అధికారుల్ని ఆదేశించారు. అటు... లారీ డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగమే ఈ ప్రమాదానికి కారణమంటున్నారు పోలీసులు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

Tags

Next Story