ఆంధ్రప్రదేశ్

ఉప్పొంగుతున్న నదులు.. మరికొద్దిరోజులు కొనసాగనున్న వర్షాలు

ఉప్పొంగుతున్న నదులు.. మరికొద్దిరోజులు కొనసాగనున్న వర్షాలు
X

ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి, కృష్ణా నదులకు వరద పోటెత్తుతోంది.. ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదతో రెండు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.. తెలంగాణలో గోదావరి ఉగ్రరూపం దాల్చితే, ఇటు కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి.. శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటి నిల్వ 118 టీఎంసీలకుపైగా చేరింది. మరికొద్దిరోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెబుతున్నారు.

గోదావరిలో వరద ఉధృతి తగ్గడం లేదు.. ధవళేశ్వరం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించినా ఎగువన మాత్రం వరదపోటు కొనసాగుతూనే ఉంది.. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు వరద తోడు కావడంతో నాలుగు రోజుల నుంచి గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది.. ప్రస్తుతం కాటన్‌ బ్యారేజ్‌ దగ్గర 13.7 అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది.. 12.8 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు అధికారులు. మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు.

ఇక తెలంగాణలోనూ గోదావరికి వరద పోటెత్తుతోంది.. కన్నాయిగూడెం మండలం దేవాదుల ఇన్‌టేక్‌ వెల్‌ వద్ద గోదావరి నీటిమట్టం 8.5 మీటర్లు దాటింది.. తుపాకుల గూడెం బ్యారేజ్‌ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తోంది. ఇక భద్రాచలం దగ్గర 43 అడుగుల నీటి ప్రవాహం ప్రస్తుతం నమోదవుతోంది.. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు.. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముంపు గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.

ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి గంటగంటకూ వరద ఉధృతి పెరుగుతోంది. ప్రస్తుతం 2.5 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా.. 45 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 864 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 118.9 టీఎంసీలకు చేరింది. ఇక పవర్‌ హౌస్‌ల ద్వారా నీటిని ఉపయోగించినప్పటికీ ఇన్‌ఫ్లో ఇలాగే కొనసాగితే మరో పది రోజుల్లో శ్రీశైలం జలాశయం గరిష్ట స్థాయికి చేరుకుంటుందని అధికారులు చెబుతున్నారు.

మరోవైపు ఉత్తర బంగాళాఖాతంలో బంగ్లాదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ తీరానికి ఆనుకుని అల్పపీడనం ఏర్పడింది.. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.. 48 గంటల్లో అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారుతుందని భారత వాతవారణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతాయని తెలిపారు. నేడు, రేపు కోస్తా జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయన్నారు.

Next Story

RELATED STORIES