హుజూర్‌న‌గ‌ర్ నుంచి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిగా..

హుజూర్‌న‌గ‌ర్ నుంచి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిగా..

తెలంగాణ‌లో హుజూర్ న‌గ‌ర్ ఉపఎన్నిక‌పై అన్నిపార్టీలు క‌న్నేశాయి. త్వర‌లోనే ఉప‌ ఎన్నిక‌ల‌ నోటిఫికేష‌న్ వ‌స్తుంద‌ని భావిస్తున్న పార్టీలు ఈస్థానాన్ని కైవ‌సం చేసుకునేందుకు పావులు క‌దుపుతున్నాయి. కాంగ్రెస్ సిట్టింగ్ సీటు కావ‌డంతో .. ఈ సీటును ద‌క్కించుకునేందుకు టీఆర్ఎస్ సీరియ‌స్‌గా దృష్టి పెడుతోంది. అటు బీజేపీ సైతం బ‌ల‌మైన అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మ‌రి ఈ రాజ‌కీయ చ‌ద‌రంగంలో హ‌స్తం పార్టీ త‌న సిట్టింగ్ సీటును నిల‌బెట్టుకోగ‌ల‌దా ..?..

తెలంగాణ‌లో మ‌రో ఉప ఎన్నిక హీట్ రాజుకుంది. హుజూర్ న‌గ‌ర్ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వ‌హించిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి న‌ల్గొండ ఎంపీగా గెల‌వ‌డంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.. దీంతో హుజూర్‌నగర్‌ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైయ్యింది. ఈ అసెంబ్లీ నియోజవర్గం నుంచి వరుసగా విజయ ఢంకా మోగిస్తున్న ఉత్తమ్‌కు గట్టి పట్టుంది. గ‌త కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధి బాగా అభివృద్ధి చేశార‌నే పేరుంది. దీంతో నియోజ‌క‌వ‌ర్గ ప్రజ‌లు ఉత్తమ్‌కు అండ‌గా నిల‌బ‌డుతూ వ‌స్తున్నారు.

అయితే ఈ ఉపఎన్నిక‌ల్లో ఎలాగైనా కాంగ్రెస్ సిట్టింగ్ సీటుకు గండికొట్టాల‌ని భావిస్తున్న టీఆర్ఎస్ .. అందుకు త‌గ్గట్టుగా పావులు క‌దుపుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో మంత్రి జదీశ్‌ రెడ్డి అనుచరుడైన సైదిరెడ్డిని తమ అభ్యర్థిగా నిలిపింది. ఉత్తమ్‌కు గట్టి పోటీ ఇచ్చి కేవలం 7వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈనేపథ్యంలో మరో సారి టిక్కెట్‌ సైదిరెడ్డికే దక్కే అవకాశం ఉంది. అధికార పార్టీ కావడం.. ఇంతకు ముందుకు ఓడిపోయిన సానుభూతి సైదిరెడ్డిపై ఉంటుందని టీఆర్‌ఎస్‌ శ్రేణులు ధీమాగా ఉన్నారు. అయితే పార్లమెంటు ఎన్నిక‌ల్లో మాత్రం ఉత్తమ్‌కు హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ కంటే 13 వేల ఆధిక్యత వ‌చ్చింది. దీంతో మ‌రోసారి ఉత్తమ్ నియోజ‌క‌వ‌ర్గంలో త‌న ప‌ట్టు నిలుపుకున్నారు.

అటు త‌న సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవ‌డం ఉత్తమ్‌కు పెద్ద స‌వాల్ గా మారింది. ఇక్కడి నుంచి ఆయ‌న భార్య ప‌ద్మావ‌తిని బ‌రిలో నిలిపే యోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈనియోజకవర్గంలో ప‌ర్యటిస్తూ ఎన్నిక‌ల‌కు సిద్ధమ‌వుతున్నారు. ఇప్పటికే నియోజ‌క‌వ‌ర్గ కార్యక‌ర్తల‌తో స‌మావేశాలు నిర్వహిస్తూ .. బీజీ బీజీగా గ‌డుపుతున్నారు. ఇక టీఆర్ఎస్‌కు కూడా ఈ సీటు ప్రతిష్ఠాత్మకంగా మారింది. పార్లమెంటు ఎన్నిక‌ల్లో కొంత చేదు ఫ‌లితాల‌తో దెబ్బతిన్న టీఆర్ఎస్ .. ఈసారి ఉప ఎన్నిక‌లో గెలిచి కాంగ్రెస్ .. బీజేపీకి చెక్ పెట్టాల‌ని భావిస్తోంది.

మరో వైపు.. పార్లమెంటు ఎన్నిక‌ల్లో ఉత్తర తెలంగాణ‌లో స‌త్తా చాటిన బీజేపీ ద‌క్షిణ తెలంగాణ‌లోనూ బ‌లోపేతం అయ్యేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తోంది. దీనికి హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నికను వేదిక‌గా మార్చుకోవాల‌ని చూస్తోంది క‌మ‌ల దళం. ఇప్పటి వ‌ర‌కు ఈపార్టీ అక్కడ పెద్దగా ప‌ట్టు లేకున్నా .. ఈ సారి రాష్ట్రంలో మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాల‌తో బ‌ల‌మైన అభ్యర్థిని నిలిపేందుకు కాషాయ పార్టీ సైతం ఉవ్వీళ్ళూరుతుంది .

మొత్తానికి హుజూర్ న‌గ‌ర్ బైపోల్‌లో కాంగ్రెస్.. టీఆర్ఎస్ .. బీజేపీ పార్టీలూ తమ స‌త్తా చాటాల‌ని భావిస్తుండ‌టంతో ఇక్కడ త్రిముఖ పోటీ త‌ప్పేట్టు లేద‌నే చెప్పాలి. రాష్ట్రంలో హీట్ హాట్‌గా మారిన ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పటికే ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం మొద‌లైంది.

Tags

Read MoreRead Less
Next Story