జర్మనీ-భారత్ మధ్య 11 కీలక ఒప్పందాలు

టెర్రరిజాన్ని దీటుగా ఎదుర్కొనేందుకు జర్మనీ, భారత్ ద్వైపాక్షిక సహకారంతో ముందుకెళ్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్ వచ్చిన జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, మోదీ సమావేశమయ్యారు. విస్తృత చర్చల అనంతరం 11 ఒప్పందాలపై సంతకాలు చేశారు. అంతరిక్షం, పౌర విమానయానం, సముద్రపు సాంకేతికత, వైద్యం, విద్య తదితర రంగాలకు సంబంధించి కీలక ఒప్పందాలు జరిగాయి.
జర్మనీ సాంకేతిక నైపుణ్యాలు.. నవభారత నిర్మాణ ప్రణాళికకు ఎంతో మేలు చేస్తాయని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితిలోని భద్రతా మండలిలో సంస్కరణలు తీసుకొచ్చే విధంగా ఇరు దేశాల మధ్య సహకారం కొనసాగుతుందని చెప్పారు. రక్షణ సంబంధ ఉత్పత్తుల్లో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జర్మనీని కోరింది భారత్. ఈ-మొబిలిటీ, స్మార్ట్ సిటీలు, నదుల శుద్ధీకరణ, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు.
భారత్-జర్మనీ మధ్య కుదిరిన ఒప్పందాలు భవిష్యత్తులో టెక్నాలజీ రంగంలో మరింత పురోగతి సాధించేందుకు దోహదం చేస్తాయని జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ అన్నారు. 5జీ, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్.. సవాల్ గా మారాయని, వాటిపై కలిసి పనిచేయడం ముఖ్యమన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com