ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది: విశాఖ పర్యటనలో కిషన్ రెడ్డి

ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది: విశాఖ పర్యటనలో కిషన్ రెడ్డి
X

ki

ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి చెప్పారు. విశాఖలో పర్యటిస్తున్నా కిషన్ రెడ్డి.. స్వచ్ఛ బీచ్‌ కార్యక్రమంలో పాల్గొనాలని నగరవాసులకు పిలుపునిచ్చారు. ఇక ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్‌ మీడియం బోధనపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపైనా ఆయన స్పందించారు.

కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కిషన్‌ రెడ్డి విశాఖలో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు ఆయనకు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. కిషన్‌ రెడ్డి ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా సీనియర్‌ నేత పీవీ చలపతిరావు నివాసానికి వెళ్లారు. చలపతిరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ తర్వాత రుషికొండలో నిర్వహించిన ఆత్మీయ సభలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సభలో బీజేపీ నాయకులు, మంత్రి అవంతి శ్రీనివాస్‌తోపాటు టీడీపీ ఎమ్మెల్యేలు, పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కిషన్‌ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ తర్వాత తనకు అత్యంత ఇష్టమైన నగరం విశాఖే అన్నారు. విశాఖను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇక రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపైనా కిషన్‌రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. మాతృ భాషకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు.

కేంద్ర మంత్రి హోదాలో తొలి విదేశీ పర్యటనకు వెళ్లిన కిషన్‌ రెడ్డి.. మెల్‌బోర్న్‌ టూర్‌ అనుభవాలను ఆత్మీయ సభలో నేతలతో పంచుకున్నారు. వచ్చే ఏడాది నవంబర్‌ లేదా డిసెంబర్‌లో నో మనీ ఫర్‌ టెర్రర్‌ పేరిట అంతర్జాతీయ సదస్సును మన దేశంలో నిర్వహించేందుకు యూఎన్‌వోను ఒప్పించామని చెప్పారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇక ప్రధాని మోదీ అద్భుతమైన పరిపాలన అందిస్తున్నారని.. ఆర్టికల్‌ 370, అయోధ్య సహా అనేక జఠిలమైన సమస్యలకు శాంతియుత పరిష్కారం చూపించారని కిషన్‌ రెడ్డి అన్నారు.

ఇక బుధవారం కూడా కిషన్‌రెడ్డి విశాఖలో పర్యటించనున్నారు. ఉదయం ఆర్కే బీచ్‌లో స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. కేంద్ర పథకాల అమలు తీరుపై మధ్యాహ్నం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత పారామిలటరీ దళాల అధికారులు సరిహద్దు భద్రత, అంతర్గత భద్రతపై కిషన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.

Tags

Next Story