నామినేటెడ్ పోస్టులపై ఆశావహుల పడిగాపులు

నామినేటెడ్ పోస్టులపై ఆశావహుల పడిగాపులు

nomi

తెలంగాణలో నామినేటెడ్‌ పోస్టుల కోసం టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆశగా ఎదురు చూస్తున్నాయి. రెండోసారి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావ‌స్తున్నా.. ఇప్పటికీ పదవుల పంపకం జరగకపోవడంతో సీనియర్లు, పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఏడాదిలో రెండు మూడు కొత్త కార్పొరేషన్‌ ఛైర్మన్లు, మరో ఇద్దరు ఛైర్మన్ల పదవీ కాలం పొడిగింపు మాత్రమే జరిగింది. చాలా కార్పొరేషన్ ఛైర్మన్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక మిగిలిన నామినేటెడ్‌ పదవుల పంపకం ఎప్పుడు జరుగుతుందా అని కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు ఆశావహులు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మొద‌టిసారి అధికారంలోకి రాగానే రాష్ట్రంలో కార్పొరేషన్లు, కమిషన్లు, ఇతర సంస్థలు కలిపి 56 మందికి చైర్మన్‌ పదవులను కట్టబెట్టింది. అందులో 49 ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఉన్నాయి. వీటిలో కొన్నింటికి మూడేళ్లు, మరికొన్ని రెండేళ్ల ప‌ద‌వీకాలంగా నిర్దేశించారు. వీటి ప‌ద‌వీకాలం ముగిసినా కొత్త వారిని నియమించలేదు. కేవ‌లం టీఎస్‌ ఐఐసీ ఛైర్మన్‌ బాలమల్లు, శాప్‌ ఛైర్మన్‌ వెంకటేశ్వరరెడ్డి పదవీ కాలం మాత్రమే రెన్యువల్‌ అయింది. ఇక ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు ఈ మ‌ధ్యే పార్టీలో చేరిన ఒంటేరు ప్రతాప్‌రెడ్డిని ఛైర్మన్‌గా నియమించారు సీఎం కేసీఆర్‌. గ‌డ్డిఅన్నారం మార్కెట్ క‌మిటీ ఛైర్మన్‌గా న‌ర్సింహ గౌడ్ నియమితులు కాగా.. మిగిలినవన్నీ ఖాళీగానే ఉన్నాయి.

టీఆర్‌ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పదవుల కోసం పార్టీ శ్రేణులు ఎదురుచూస్తునే ఉన్నాయి. దాదాపు 500 వరకు నామినేటెడ్‌ పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని తెలుస్తోంది. ఈ లెక్కన ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నలుగురికిపైగా అవకాశం లభిస్తుంది. రాష్ట్రస్థాయిలోని కొన్ని కార్పొరేషన్లలో కనీసం ఆరుగురి నుంచి 15 మంది వరకు డైరెక్టర్లు, సభ్యులను నియమించే అవకాశముంది. మొత్తంగా కార్పొరేషన్లకు ఛైర్మన్లను ఏర్పాటు చేసి అనుబంధంగా నామినేటెడ్‌ పదవులను ఇస్తే సుమారు 500 మందికిపైగా నేతలకు ఛాన్స్‌ దక్కుతుందని పార్టీ నాయకులే చెబుతున్నారు.

ఇక మంత్రి ప‌ద‌వులు దక్కని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌కు చీఫ్ విప్‌లు, విప్‌ ప‌ద‌వులు ద‌క్కాయి. కానీ, గతంలో పార్టీ కీల‌క ప‌ద‌వులు అనుభ‌వించిన వారు తమవంతు ఎప్పుడు వస్తుందా అని ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు. శాశన స‌భ మాజీ స్పీక‌ర్ మధుసూదనాచారి, మాజీ హోంమంత్రి నాయిని న‌ర్సింహారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కడియం, మండ‌లి మాజీ ఛైర్మన్‌ స్వామి గౌడ్, మాజీ మంత్రులు తుమ్మల, జోగురామన్న, లక్ష్మారెడ్డి లాంటి నేతలు తమకు అధినేత ఏదో ఒక పదవి కట్టబెట్టకపోతారా అన్న ఆశతో ఇప్పటికీ చూస్తూనే ఉన్నారు. వీరికితోడు మొదట్నుంచి పార్టీని అంటిపెట్టుకుని వున్న నేతలు.. అంతర్గత విభేదాలతో గత ఎన్నికల్లో ఓడిపోయిన సీనియర్లు కూడా తమకు సముచిత స్థానం దక్కుతుందనే ఆశతో ఉన్నారు. కానీ, అధినేత కేసీఆర్‌ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మరికొన్నాళ్లు ఈ నిరీక్షణ తప్పదేమోననే ప్రచారం జరుగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story