రాజధాని ప్రాంతంలో చంద్రబాబు పర్యటన రూట్ మ్యాప్..

రాజధాని ప్రాంతంలో చంద్రబాబు పర్యటన రూట్ మ్యాప్..
X

chandrababu

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో గురువారం టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి టీడీపీ ప్రజాప్రతినిధులు, ఇతర నేతలతో కలిసి చంద్రబాబు అమరావతి పర్యటన మొదలు పెడతారు. ప్రస్తుత ప్రభుత్వం అమరావతి పనులను నిలిపివేయడాన్ని టీడీపీ తీవ్రంగా తప్పుపడుతోంది. ఉపాధి లేక కూలీలు జీవనోపాధి కోల్పోయారని.. రాజధాని ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని ఫైరవుతోంది. రాజధాని ప్రాంతంలో వాస్తవ పరిస్థితులను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా చంద్రబాబు బృందం పర్యటన సాగనుంది. ఈ పర్యటనలో రాజధాని ప్రాంత రైతులతో చంద్రబాబు మాట్లాడనున్నారు.

వెంకటాయపాలెం, ఉద్దండరాయునిపాలెం, నేలపాడు, రాయపూడి, ఐనవోలు గ్రామాల మీదుగా టీడీపీ బృందం పర్యటన సాగుతుంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో గత ఐదేళ్లలో అమరావతిలో జరిగిన నిర్మాణాలు, రోడ్‌ ప్రాజెక్టులను పరిశీలిస్తారు. మొదట సీడ్‌ యాక్సిస్‌ రోడ్‌ ద్వారా వెంకటాయపాలెం మీదుగా ఉద్దండరాయునిపాలెం చేరుకుని పేదల గృహ సముదాయాలను చంద్రబాబు పరిశీలిస్తారు. ఆ తర్వాత ఎన్జీవోలు, ఉద్యోగుల క్వార్టర్స్‌ను పరిశీలిస్తారు. అలాగే ఎమ్మెల్యేల గృహ నిర్మాణాలు, జడ్జిల బంగ్లాలను సందర్శిస్తారు.

అమరావతిలో ఏం జరుగుతోందో చెప్పేందుకే రాజధాని పర్యటనకు వెళ్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. వైసీపీ నేతలు, మంత్రులు ఏపీ బ్రాండ్ ఇమేజ్ చెడగొడుతున్నారని ఫైర్ అయ్యారు. మంత్రులు రాజధానిని స్మశానంతో పోలుస్తూ భ్రష్టుపట్టించాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో పెట్టుబడులు రాకుండా చేసి, విశ్వసనీయతను దెబ్బతీస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

మరోవైపు చంద్రబాబు పర్యటనపై వైసీపీ నేతలు విమర్శలకు దిగుతున్నారు. రాజధానిలో పర్యటించే నైతిక అర్హత చంద్రబాబుకు లేదని మంత్రి పేర్నినాని అన్నారు. రాజధానికి సరైన రోడ్లు వేయని ఆయన ఇప్పుడెందుకు అమరావతిలో పర్యటిస్తున్నారని ప్రశ్నించారు.

Tags

Next Story