పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్

గ్రామ కమిటీల ఏర్పాటుపై పార్టీ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రాస్థాయి కార్యకర్తల్లో ఉత్సాహం మెండుగా ఉందన్నారు చంద్రబాబు. కార్యకర్తల్లో పట్టుదల మరింత పెరిగిందని.. వాళ్ల ఉత్సాహమే పార్టీకి ఎనలేని బలమని నేతలతో చంద్రబాబు అన్నారు. పార్టీ పటిష్టతపైనే అందరూ దృష్టి కేంద్రీకరించాలన్నారు. వైసీపీ ప్రభుత్వం 6 నెలల్లో అన్ని వైఫల్యాలే అన్నారు. వైసీపీ చేతగానితనం వల్లే రాష్ట్రానికి కీడు జరుగుతోందని బాబు ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులు, యువత, మహిళల ఆశలను నీరు గార్చారన్నారు చంద్రబాబు. ఇప్పుడు జరుగుతున్నన్ని ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు గతంలో లేవని టీడీపీ నేతల టెలికాన్ఫరెన్స్‌లో బాబు అన్నారు. ఇసుక కొరతతో 60 మంది ఆత్మహత్యలు చేసుకోవడం దేశంలో ఇదే తొలిసారని చెప్పారు చంద్రబాబు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయన్నారు. మద్యం ధరలను 150 నుంచి 200 శాతం పెంచారన్నారు. పెట్టుబడులన్నీ రాష్ట్రం నుంచి వెనక్కిపోయాయన్నారు. రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారన్నారు బాబు. అధికార పార్టీ అరాచకాలను ప్రజల్లో ఎండగట్టి, వీటన్నింటిపై గ్రామాలు, వార్డుల్లో చర్చలు చేయాలన్నారు. పంచాయితీ ఎన్నికల్లోపు పార్టీ కమిటీలన్నీ ఏర్పాటు చేయాలని నేతలు చంద్రబాబు సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com