అమల్లోకి వచ్చిన ఆర్టీసీ కొత్త ఛార్జీలు..

అమల్లోకి వచ్చిన ఆర్టీసీ కొత్త ఛార్జీలు..

tttrrrsss

తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి. కార్మికులతో ఆత్మీయ సమావేశం సందర్భంగా సీఎం కేసీఆర్ ముందుగా ప్రకటించినట్టుగానే యాజమాన్యం ఛార్జీలను పెంచేసింది. కిలోమీటరకు 20 పైసల పెంపు అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. వీటికితోడు టోల్ ప్లాజా రుసుము, జీఎస్టీ, ప్యాసింజర్ సెస్‌ను ఆర్టీసీ అదనంగా వసూలు చేయనుంది. పెరిగిన ఛార్జీలతో ప్రయాణికులు బస్సెక్కాలంటేనే భయపడుతున్నారు.

తెలంగాణలో సమ్మె కారణంగా బస్సుల్లేక తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రయాణికులకు.. ఇప్పుడు ఆర్టీసీ షాక్‌ ఇచ్చింది. సమ్మె సమయంలో కార్మికుల తీరుపై నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్‌.. వాళ్లు సమ్మె విరమించడంతో.. వారికి విందు భోజనం పెట్టి మరీ వరాలు కురిపించారు. అయితే సంస్థను లాభాల్లో పెట్టాలంటే ఛార్జీలు పెంచక తప్పదని.. ప్రయాణికులపై బాంబ్‌ పేల్చారు. సీఎం ఆదేశాలతో ఆర్టీసీ యాజమాన్యం ఛార్జీలు పెంచేసింది. అర్థరాత్రి నుంచే పెరిగిన ఛార్జీలు అమల్లోకి వచ్చాయి.

ప్రతి బస్సు టికెట్‌పై కిలోమీటర్‌కి 20 పైసలు ఛార్జీ పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఈ లెక్కన 100 కిలోమీటర్లు ప్రయాణించేవారికి.. అదనంగా 20 రూపాయల భారం తప్పదు. పల్లెవెలుగులో కనీస ఛార్జీ 5 నుంచి 10 రూపాయలకు.. సెమీ ఎక్స్‌ప్రెస్‌ కనీస ఛార్జీ 10 రూపాయలు.. ఎక్స్‌ప్రెస్‌ బస్సులో 10 నుంచి 15 రూపాయలు.. సూపర్‌ లగ్జరీలో కనీస ఛార్జీ పాతిక రూపాయలకు చేరుతుంది. రాజధాని, వజ్ర, గరుడ, గరుడ ప్లస్‌ అన్ని బస్సుల ఛార్జీ కనీసం 35 రూపాయలు పెరగనుంది. వెన్నెల ఏసీ స్లీపర్‌లో కనీస ఛార్జీ 75 రూపాయలకు పెంచాలని ఆర్టీసీ నిర్ణయించింది.

ఇక టికెట్‌తో పాటు.. అన్ని రకాల బస్‌పాస్‌ల ఛార్జీలు కూడా పెరిగాయి. సిటీ ఆర్డినరీ పాస్‌ 770 నుంచి 950 రూపాయలు, మెట్రోపాస్‌ 880 నుంచి 1070 రూపాయలకు పెంచారు. మెట్రో డీలక్స్‌ పాస్‌ 990 రూపాయల నుంచి 1180 రూపాయలకు, స్టూడెంట్‌ బస్‌పాస్‌ 130 నుంచి 165 రూపాయలకు పెంచుతూ ఆర్టీసీ నిర్ణయించుకుంది. తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు కృషి చేస్తోందన్నారు మంత్రి పువ్వాడ అజయ్. భవిష్యత్ లో ఆర్టీసీ ఉద్యోగులకు కూడా.. సింగరేణి మాదిరిగా లాభాల్లో వాటా ఇస్తామని చెప్పారు.

అటు తెలంగాణలో ఆర్టీసీ బస్సు చార్జీల పెంపుపై ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మండిపడ్డారు. జగిత్యాలలో ధరల పెంపునకు నిరసనగా రాస్తారోకో చేపట్టారు. సామాన్య ప్రజలపై ఆర్థిక భారం తగదన్నారు.

ఆర్టీసీ ఛార్జీల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్‌ ఆందోళన బాట పట్టింది. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు లక్డీకాపుల్‌లోని కలెక్టర్‌ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించారు. ఛార్జీల పెంచవద్దని నినాదాలు చేశారు.

ఛార్జీల పెంపుపై ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. పెంచింది తక్కువే అయినా.. చిల్లర తిప్పలు లేకుండా అడ్జస్ట్‌మెంట్ల పేరుతో బాదుడు తప్పట్లేదు. కిలోమీటర్‌కి 20 పైసలు పెంచితే... ప్రజల దగ్గర 20 పైసలు ఉండదు కాబట్టి.. రౌండ్‌ ఫిగర్‌ చేస్తారు. అంటే... హైదరాబాద్‌లో కనిష్ట ఛార్జీ 5 రూపాయలు.. 2 నుంచి 5వ స్టాప్ వరకూ ప్రస్తుతం 10 రూపాయలు తీసుకుంటున్నారు. కొత్త ఛార్జీల ప్రకారం 15 రూపాయలు అవుతుంది.

Tags

Read MoreRead Less
Next Story