రెండోసారి సీఎంగా ఏడాది పూర్తి చేసుకున్న కేసీఆర్ పాలన ఇలా..

రెండోసారి సీఎంగా ఏడాది పూర్తి చేసుకున్న కేసీఆర్ పాలన ఇలా..

cm-kcr

రెండోసారి సీఎంగా ఏడాది పూర్తి చేసుకున్నారు కేసీఆర్. గ‌తేడాది ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లిన టీఆర్ఎస్ ఎవ‌రూ ఊహించ‌ని విధంగా గ‌తంలో కంటే బంప‌ర్ మెజారీటీని సొంతం చేసుకంది. 88సీట్లను గెలుచుకుని రెండోసారి అధికార ప‌గ్గాలు చేప‌ట్టి నేటికి స‌రిగ్గా ఏడాది పూర్తయింది. ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా ముందుగా గ‌త డిసెంబ‌ర్ 13వ తేదీన సీఎం కేసిఆర్, మ‌హ్మూద్ అలీ ఇద్దరు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. కేబినెట్ విస్తర‌ణ‌కు చాలా టైం తీసుకున్న కేసిఆర్.. 67రోజుల త‌ర్వాత మ‌రో ప‌ది మందితో విస్తర‌ణ చేశారు. మ‌ళ్లీ 6నెల‌ల తర్వాత మ‌రో ఆరుగురును మంత్రి వ‌ర్గంలోకి తీసుకొని పూర్తి స్థాయి కేబినెట్‌ను ఏర్పాటు చేశారు.

88మంది ఎమ్మెల్యేల‌ను గెలుచుకున్న టిఆర్‌ఎస్‌ మరికొంత మంది చేరిక‌ల‌తో మ‌రింత బ‌ల‌ప‌డింది. ఎన్నికల అనంతరం వెంట‌నే ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు జాయిన్ కావ‌డంతో 90కి చేరింది. అటు కాంగ్రెస్‌లో ఉన్న మెజారిటీ ఎమ్మెల్యేలు గులాబీ గూటికి క్యూ క‌ట్టారు. 12 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరారు. అంతే కాదూ.. ఏకంగా కాంగ్రెస్ శాస‌న స‌భా ప‌క్షాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేశారు. దీనిపై కాంగ్రెస్ ఆరోప‌ణలు చేసినా.. గులాబీ బాస్ కొట్టి పారేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా త‌మ పార్టీలో చేరార‌ని.. రూల్స్ ప్రకార‌మే విలీనం జ‌రిగింద‌ని టీఆర్‌ఎస్‌ నేత‌లు పేర్కొన్నారు.

ఇక ముంద‌స్తు జోష్‌తో అధికారాన్ని చేపట్టిన గులాబీ పార్టీకి లోక్‌స‌భ ఎన్నికల్లో మాత్రం సీన్ రివర్సైంది. 9ఎంపీ సీట్లను గెలిచి అన్ని పార్టీల‌కంటే మెరుగ్గా ఉన్నా.. న‌లుగురు కీల‌క‌మైన నేత‌లు ఓడిపోవ‌డం కారు స్పీడ్‌కు బ్రేక్‌లేసింది. కారు.. సారు.. పదహారు స్లోగ‌న్ తో వెళ్లిన టీఆర్‌ఎస్‌కు లోక‌స‌భ ఫ‌లితాలు నిరాశ మిగిల్చాయి.

ప‌ది జిల్లాలు ఉన్న తెలంగాణ‌ను 33 జిల్లాలుగా ఏర్పాటు చేయ‌డం గులాబీ దళానికి బాగా క‌లిసొచ్చింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక‌ల్లో కారు హ‌వా కొన‌సాగింది. అన్ని జెడ్పీ ఛైర్మన్‌ల‌ను కైవ‌సం చేసుకుంది. మెజారిటీ మండ‌ల ప‌రిష‌త్ ల‌ను కూడా గుల‌బీ పార్టీ త‌న ఖాతాలో వేసుకుంది. లోక్ స‌భ ఎన్నిక‌ల్లో వ‌చ్చిన ప్రతికూల రిజ‌ల్ట్స్ .. జెడ్పీటీసీ ఎన్నిక‌ల్లో క‌న‌బ‌డ‌క పోవ‌డంతో టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో మ‌రింత జోష్ పెరిగింది.

హుజూర్ న‌గ‌ర్ లో టీఆరెఎస్ చ‌రిత్ర సృష్టించింది. అక్కడ జ‌రిగిన ఉపఎన్నిక‌లో TRS గెలిచింది. కాంగ్రెస్ కంచుకోట‌లో తొలిసారి పాగా వేసింది. అదే స‌మ‌యంలో ఆర్టీసి స‌మ్మె సాగుతున్నా.. టీఆర్‌ఎస్‌ విజ‌యంపై ఎలాంటి ప్రభావం ప‌డ‌లేదు. పైగా బంప‌ర్ మెజారిటీతో హుజూర్ న‌గ‌ర్ ను త‌న ఖాతాలో వేసుకుంది.

ఇక ఆర్టీసి ఇష్యూ టీఆర్‌ఎస్‌ క్యాడ‌ర్‌ను కాస్త క‌ల‌వ‌ర‌పెట్టింది. దాదాపు రెండు నెల‌ల పాటు సాగిన ఆర్టీసి స‌మ్మెతో గులాబీ పార్టీకి ఎదురు దెబ్బ త‌గిలింద‌ని అంద‌రూ భావించారు. అన్ని పార్టీలు ఏక‌మై టీఆర్‌ఎస్‌ డౌన్ ఫాల్ మొద‌లైంద‌ని విమర్శలు కుప్పించాయి. కార్మికుల్లో కూడా పూర్తి వ్యతిరేక‌త వ్యక్తమైంది. కొంద‌రు కార్మికులు ఆత్మహ‌త్యల‌కు కూడా పాల్పడ్డారు. ద‌ర్నాలు, రాస్తారోకోల‌తో గులాబీ పార్టీని అన్ని పార్టీలు టార్గెట్ చేశాయి. కానీ కార్మికుల డిమాండ్లు నెర‌వేర్చడం సాధ్యం కావ‌ని మొద‌ట్నించీ సీఎం చెబుతుండ‌టంతో.. 54రోజుల తర్వాత కార్మికులు స‌మ్మె విర‌మించారు. దీంతో ఎలాంటి ష‌ర‌తులు లేకుండా కార్మికుల‌ను సీఎం మ‌ళ్లీ విధుల్లోకి తీసుకున్నారు. అంతే కాదు కార్మికుల్లో నెల‌కొన్న వ్యతిరేక‌త‌ను తొల‌గించేందుకు గులాబీ బాస్ కార్మికుల‌ను పిలిపించుకొని మాట్లాడారు. చాలా వ‌ర‌కు కార్మికుల‌కు అనుకూల నిర్ణయాలు తీసుకోవ‌డంతో ఆర్టీసి సమస్య స‌మ‌సి పోయింది. దీంతో గులాబీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు.

అటు దిశా హ‌త్యాచారం, హ‌త్యకేసులో న‌లుగురు నిందితులు ఎన్‌కౌంటర్‌ అయ్యారు. దీంతో గులాబీ పార్టీ పై ప్రజా సంఘాలు, మానవ హ‌క్కుల‌ నుంచి వ్యతిరేక‌త వ్యక్తం అయింది. కానీ దిశా హ‌త్య జ‌రిగిన వెంట‌నే ప్రజ‌లంతా స‌త్వర న్యాయం జ‌ర‌గాల‌ని పెద్ద ఎత్తున ఆందోళ‌న జ‌రిగాయి. ఈ ఘ‌ట‌న ఢిల్లీని కూడా తాకింది. నిందితులను ఎన్‌ కౌంటర్‌ చేయాలని నిర‌స‌నలు హోరెత్తాయి. కేసు విచార‌ణ‌లో త‌ప్పించుకోబోయిన నిందితులు ఎన్‌కౌంట‌ర్ అయ్యారు. ఒక విధంగా దీనికి ప్రజ‌ల‌ను పూర్తి మ‌ద్దతు రావ‌డంతో గులాబీ పార్టీకి ఇబ్బందులు త‌ప్పాయి.

ఇలా ఏడాది పాటు కీల‌క‌మైన ప‌రిణామాలు చోటు చేసుకున్నా.. పార్టీ ఇబ్బందుల్లో ప‌డ‌కుండా అన్నింటిని అధిగ‌మించింద‌నే చెప్పవచ్చు.

Tags

Next Story