చట్టాలు తేవడం కాదు.. అమల్లో చిత్తశుద్ధి ఉండాలి : చంద్రబాబు


గుంటూరులో బాలికపై అత్యాచార ఘటనను అటు ప్రభుత్వం.. ఇటు విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో బాలికతో పాటు ఆమె కుటుంబాన్ని పరామర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ ఘటన బాధాకరమని, తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. బాలికపై అత్యాచారం జరిగితే బాధిత కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని సీఎం జగన్ ను నిలదీశారు చంద్రబాబు. నిందితుడు లక్ష్మారెడ్డిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దోషులను కఠినంగా శిక్షించినపుడే మిగిలిన వారికి భయం పుడుతుందన్నారు.
చట్టాలు తేవడం ఎంతముఖ్యమో..ఆ చట్టాలు అమలు చేయడంలోనూ ప్రభుత్వానికి అంతే చిత్తశుద్ధి ఉండాలని వైసీపీ సర్కార్‌కు హితవు పలికారు చంద్రబాబు. ఆ కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితురాలి కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ తరఫున రూ.50వేల ఆర్థికసాయం అందజేస్తామన్నారు. బాధితురాలి పేరిట రూ.25 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని.. ఉన్నత చదువు పూర్తయ్యే వరకు ప్రభుత్వమే ఆ ఖర్చులు భరించాలని కోరారు. A.N.Mగా పనిచేస్తున్న బాధితురాలి తల్లికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఇంటిస్థలం కేటాయించాలన్నారు.
అటు.. అత్యాచార బాధితురాలిని.. హోంమంత్రి మేకతోటి సుచరిత పరామర్శించారు. ఈ ఘటన అత్యంత బాధాకరం అన్నారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు అప్రమత్తం అయ్యారని.. నిందితున్ని అరెస్ట్ చేశారని హోంమంత్రి అన్నారు. బాలిక కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.5లక్షల నగదు, ఎస్పీ, ఎస్టీ చట్టం కింద రూ.రెండున్నర లక్షలు, చదువు కోసం రూ. 2లక్షలు అందజేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఇంటి స్థలం కూడా కేటాయిస్తామన్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని.. దిశ చట్టాన్ని త్వరలోనే అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు హోంమంత్రి సుచరిత.
బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి మరణశిక్ష వేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. బాధిత బాలికను పరామర్శించిన కన్నా.. అసెంబ్లీలో దిశ చట్టం చేసిన రోజే బాలికపై ఆఘాయిత్యం జరగడం దారుణం అన్నారు. సమాజంలో మహిళలపై యథేచ్చగా అకృత్యాలు జరుగుతున్నాయన్నారు. దిశ చట్టం తెచ్చిన రోజే గుంటూరులో బాలికపై అత్యాచారం జరగడాన్ని అందరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

