రాజధానికి మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతం నుంచి సమరశంఖం పూరించిన అమరావతి రైతులు

మూడు రాజధానుల ప్రకటనపై అమరావతి ప్రాంతవాసులు భగ్గుమంటున్నారు. ఉద్దండరాయునిపాలెం,తుళ్లూరు, మందడం, కృష్ణాయపాలెం, వెలగపూడి ఇలా ప్రతిచోటా నిరసనలు హోరెత్తుతున్నాయి. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన రాజధాని రైతులు.. గురువారం అమరావతి పరిధిలోని అన్ని గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చారు. ఆందోళనలు ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు.
ఎవరికైనా రోగం వస్తే చికిత్స ఒక ప్రాంతంలో, పరీక్షలు మరో ప్రాంతంలో, మందులు వేరే చోట తెచ్చుకుంటారా? ఇలా చేస్తే ఆ రోగి చనిపోతాడు. మూడు రాజధానులు ఏర్పాటు నిర్ణయం కూడా అలాగే ఉంది. ఇది రాజధాని అమరావతి ప్రాంత వాసుల మాట. తక్షణం ఈ ప్రతిపాదన వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెలగపూడి, వెంకటపాలెంలో నిరాహార దీక్షలు చేపట్టారు. మందడంలో రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు.
ప్రధాని మోదీ రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసిన గుంటూరులోని ఉద్దండరాయునిపాలెంలో రైతులు సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు జరిపిన రైతులు.. ఆందోళనలు ఎలా ఉద్ధృతం చేయాలి, సమస్యను ఎలా తెలియజేయాలి అనేదానిపై చర్చించారు. గురువారం రాజధాని బంద్‌కు పిలుపునిచ్చారు. కేపిటల్ ఏరియాలోని 29 గ్రామాల్లో బంద్ చేపట్టనున్నారు. అలాగే అన్ని గ్రామాల్లోని గ్రామ సచివాలయాల వద్ద నిరసనలు తెలపాలని నిర్ణయించారు. రైతులంతా రోడ్లపైకి రావాలని నిర్ణయించారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి వెలగపూడిలో రిలే దీక్షలు చేపట్టనున్నారు.
రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్ తరాలు బాగుంటాయన్న మంచి ఉద్దేశంతో భూములు ఇచ్చామని, ఇప్పుడు అభివృద్ధిని మధ్యలో వదిలేస్తే ఎలాగని ప్రశ్నిస్తున్నారు రైతులు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అమరావతి కోసం దాదాపు 33 వేల ఎకరాలకుపైగా భూమిని సేకరించారు. తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు 3 రాజధానులంటూ నట్టేట ముంచితే ఎలాగంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com