విభజన వలన రాజధానిని కోల్పోయిన రాష్ట్రం దేశంలో ఒక్క ఏపీ మాత్రమే: జగన్

విభజన వలన రాజధానిని కోల్పోయిన రాష్ట్రం దేశంలో ఒక్క ఏపీ మాత్రమే: జగన్
X

cm-jagan

విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌ తీవ్రంగా దెబ్బతిందని.. అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించడం వల్ల రాజధానిని కోల్పోయామని 15వ ఆర్థిక సంఘానికి వివరించారు సీఎం జగన్‌. గురువారం15వ ఆర్ధిక సంఘం చైర్మన్‌ ఎన్‌.కె.సింగ్, కార్యదర్శి అరవింద్‌ మెహతా, రవి కోటా తదితరులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు సీఎం జగన్‌. ఈ సందర్భంగా రాష్ట్ర పరిస్థితిని వివరించారాయన. విభజన వల్ల రాజధానిని కోల్పోయిన రాష్ట్రం దేశంలో ఏపీ మాత్రమేనన్నారు. అన్ని రంగాల్లో రాష్ట్రం కోలుకోవాలంటే ఉదారంగా కేంద్రం నుంచి నిధులు అందేలా సిఫార్సులు చేయాలని ఎన్‌కే సింగ్‌ను కోరారు.

ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు.. ఆయా రంగాలపై ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని వివరించారు. స్కూళ్లలో నాడు - నేడు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టామన్నారు. స్కూళ్లలో కనీస సదుపాయాలను మెరుగు పరుస్తున్నామని 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియంలో బోధన ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అమ్మ ఒడి కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపడుతున్నట్లు తెలిపారు. పేద విద్యార్థులు ఎంత వరకు చదువుకుంటే అంత వరకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తున్నామన్నారు.

ఇక పరిపాలన సంస్కరణల్లో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాలను తీసుకువచ్చామని 15వ ఆర్ధిక సంఘానికి వివరించారు. ప్రతి 2 వేల జనాభాకు ఒక గ్రామ సచివాలయం ఉందని.. ఇప్పుడు ప్రభుత్వ పాలన నేరుగా గ్రామాలకు చేరిందన్నారు. అటు.. ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేస్తున్నామన్నారు. వైద్యం ఖర్చు వేయి దాటితే ఆరోగ్యశ్రీని అందిస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రుల అభివృద్ధికి నాడు – నేడు 14 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.

వచ్చే ఉగాదికి 25 లక్షలమందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నట్లు వివరించారు. గోదావరి – పెన్నా అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తి చేయాల్సి ఉందని.. ఇందుకోసం కేంద్రం నుంచి బకాయిలను విడుదల చేయాలని కోరారు. పౌష్టికాహార లోపం నివారణపై దృష్టి పెట్టినట్లు వివరించారు. బియ్యం నాణ్యత పెంచామని.. శ్రీకాకుళంలో పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టినట్లు తెలిపారు. వచ్చే ఏప్రిల్‌ నాటికి అన్ని జిల్లాల్లో అందిస్తున్నామని.. బియ్యాన్ని ప్యాక్‌ చేసి ఇస్తున్నట్లు వెల్లడించారు.

Tags

Next Story