జేసీ వ్యాఖ్యలపై మండిపడుతున్న పోలీసులు

పోలీసులను ఉద్దేశించి మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది. జేసీ వ్యాఖ్యలపై పోలీస్ సంఘం మండిపడుతోంది. పోలీసులపై తరచూ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తమ మనోభావాలు కించపరుస్తున్నారంటూ పోలీస్ సంఘం.. అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో జేసీపై సెక్షన్ 15A, 506 ప్రకారం కేసు నమోదు చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేలను బెదిరించారని అటు చంద్రదండు ప్రకాష్ నాయుడుపై కూడా కేసు నమోదైంది.
ఇటీవల అనంతపురం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు సమీక్షల్లో భాగంగా.. పోలీసులపై పరుషంగా మాట్లాడారు జేసీ. వైసీపీ నేతలకు పోలీసులు తొత్తులుగా మారి.. టీడీపీ శ్రేణులపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఊగిపోయిన జేసీ.. తమ ప్రభుత్వం ఏర్పడితే బూట్లు నాకే వారినే ఉంచుకుంటాం అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై పోలీస్ సంఘం నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జేసీ గతంలో కూడా ఇదే విధంగా కించపరిచేలా మాట్లాడి తమ కుటుంబాల్లో తలెత్తుకోలేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యలపై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓసారి పోలీసులపై జేసీ దివాకర్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు తాను మీసం మెలేస్తే ప్రజలు తనను ఎంపీగా ఎన్నుకున్నారని గుర్తు చేశారు. పోలీస్ శాఖ ప్రజలకు ఎనలేని సేవ చేస్తోందని.. ఆ శాఖపై తనకు ఎంతో అభిమానం ఉందంటూ బూట్లు ముద్దాడాడు గోరంట్ల మాధవ్.
అటు జేసీ దివాకర్‌రెడ్డిపై తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి కూడా మండిపడ్డారు. గత ఐదేళ్లు పోలీస్ వ్యవస్థను వాడుకున్నప్పుడు పోలీస్ విలువ తెలియదా అని జేసీని ప్రశ్నించారు. అధికారం కోల్పోయిన తరువాత జేసీ సోదరులు అసహనంతో, నోటి దురుసు ప్రదర్శిస్తూ పోలీసులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
పోలీసులపై తన వ్యాఖ్యలు వివాదం కావడంతో దీనిపై వివరణ ఇచ్చారు జేసీ దివాకర్‌రెడ్డి. గత ప్రభుత్వాలు పోలీసులను ఇంత దిగజారుడుగా వాడుకోలేదని.. టీడీపీ వస్తే తాము చెప్పినట్లు చేసేవాళ్లనే తీసుకుంటామన్న ఉద్దేశంతోనే అలా అన్నానని.. అందులో ఇతర ఉద్దేశాలేమి లేవని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com