బోస్టన్ రిపోర్ట్ కాదు.. జగన్ బోగస్ రిపోర్ట్: లోకేష్
బోస్టన్ కమిటీ నివేదికపై ట్విట్టర్‌లో విమర్శలు చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. అది బోస్టన్ రిపోర్ట్ కాదని.. జగన్ బోగస్ రిపోర్ట్ అని మండిపడ్డారు. అమరావతిని చంపేయాలన్న దురుద్దేశంతో గత ఐదేళ్లలో జగన్ గారు రాసిన స్క్రిప్ట్‌నే మరోసారి బోస్టన్ రిపోర్ట్ పేరుతో బయటపెట్టారని ఆరోపించారు. పెద్ద పెద్ద నగర శివార్లలో అభివృద్ధి చేసిన సాటిలైట్ సిటీలు, టెక్నాలజీ హబ్‌లు, అర్బన్ టౌన్‌షిప్‌లను గ్రీన్ సిటీలుగా చూపించి.. అవన్నీ ఫెయిల్ అయ్యాయని చెప్పడాన్ని బట్టి చూస్తే.. బీసీజీ రిపోర్ట్ చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుందన్నారు
ఏటా లక్షా 30 వేల కోట్ల ఆదాయం వస్తున్న గ్రీన్ ఫీల్డ్ సిటీ అయిన సైబరాబాద్‌ను కమిటీ ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని లోకేష్ ప్రశ్నించారు. రాజధాని ఏర్పాటుకు అమరావతి అనువైన ప్రాంతం అని శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. అమరావతి ముంపుకు గురవుతుందని.. భూమి స్వభావం వల్ల నిర్మాణ వ్యయం పెరుగుతుందంటూ అసత్య ఆరోపణలు చేసి జగన్ గారు కోర్టుకెళ్లి మొట్టికాయలు తిన్నారు. అయినా జగన్ గారి వక్రబుద్ధి మారలేదని లోకేష్ ఎద్దేవా చేశారు.
కోర్టులు చివాట్లు పెట్టిన అంశాలనే రిపోర్టులో పెట్టి అది బోగస్ రిపోర్టే అని జగన్ గారే స్వయంగా ప్రకటించారని లోకేష్ అన్నారు. ముఖ్యమంత్రి, మంత్రుల స్టేట్‌మెంట్లనే కమిటీ రిపోర్టులుగా ఇచ్చారని ట్వీట్టర్‌లో పేర్కొన్నారు. జీఎన్‌రావు, బోస్టన్ కమిటీ రిపోర్ట్‌ల విశ్వసనీయత ఏంటో న్యాయ స్థానాల ముందు తేలిపోతుందన్నారు. కన్సల్టింగ్ కంపెనీలను ముంచడం జగన్ గారికి అలవాటేగా అని ట్విట్టర్‌లో మండిపడ్డారు లోకేష్.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com