ఎమ్మెల్యే రోజా నియోజకవర్గంలో రచ్చకెక్కుతున్న వైసీపీ వర్గ పోరు

ఎమ్మెల్యే రోజా నియోజకవర్గంలో   రచ్చకెక్కుతున్న వైసీపీ వర్గ పోరు

roja

నగరి ఎమ్మెల్యే ఆర్‌ కె రోజ సొంత నియోజకవర్గంలో వర్గ విబేధాలు రచ్చ రచ్చ అవుతున్నాయి. పుత్తూరు మండలంలోని కేబీఆర్ పురం గ్రామ పంచాయతీ సచివాలయ భవన నిర్మాణానికి భూమి పూజ చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యేను అదే పార్టీకి చెందిన స్థానికులు అడ్డుకున్నారు. తిరుగు ప్రయాణంలో ఆమె ప్రయాణిస్తున్న కారును అడ్డుకుని నిరసన తెలిపారు. దీంతో రోజా అనుచరులు.. వైసీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల సాయంతో రోజా అక్కడ నుంచి బయటపడ్డారు.

టీడీపీ నుంచి వైసీపీలో చేరిన వారికే రోజా పెద్ద పీట వేస్తున్నారంటూ ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల సచివాలయం నిర్మించేందుకు అనువైన స్థలాన్ని అదే గ్రామంలో వైసీపీ పార్టీకి చెందిన ఓ రైతు విరాళంగా తన భూమి ఇచ్చాడు. రోజా మాత్రం టీడీపీ నుంచి వసల వచ్చిన నాయకుడు చూపించిన స్థలంలో భూమి పూజ నిర్వహించారు.

రెండోసారి ఎమ్మెల్యేగా నెగ్గిన వెంటనే పుత్తూరులో వైసీపీకి చెందిన కీలక నాయకుడు ఏలుమలైను రోజా పక్కన పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. వాలంటీర్లు, కాంట్రాక్టు వర్కుల్లో ఆయన వర్గాన్ని పట్టించుకోలేదు. ఇసుక తరలిస్తున్నారనే ఆరోపణలపై ఆయన వర్గీయులపై కేసులు నమోదు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో నవంబర్‌లోనే ఎమ్మెల్యే రోజాపై సీఎం జగన్‌కు.. ఏలుమలై ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య విబేధాలు ఇంకాస్త పెరిగాయి.

మొన్న అక్టోబర్‌లో ఏలుమలై వర్గానికి వ్యతిరేకులైన టీడీపీ నాయకులను ఏరికోరి రోజా వైసీపీ తీర్థం తీసుకునేలా ప్రోత్సహించారనే ప్రచారం ఉంది. దీనికి తోడు ఏలుమలైకి ముఖ్య అనుచరుడైన మాజీ జెడ్పీటీసీ కమలమ్మ కుమారుడు ప్రతాప్‌ను పక్కనబెడుతూ అదే పంచాయతీకి చెందిన టీడీపీ నుంచి వలస వచ్చిన లోకనాధం యాదవ్‌కు ప్రాధాన్యత ఇవ్వడంతోనే.. ఆదివారం రోజాను నిలదీసినట్టు సమాచారం. అయితే ఆ గొడవ అంతటితో ఆగలేదు.

గత ఎన్నికల్లో తనకు వెన్నుపోటు పొడిచిన వారే ఇప్పుడు తనపై దాడి చేశారని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీకి సోపర్ట్‌ చేస్తూ వైసీపీ ముసుగులో తనపై దాడికి యత్నించారని ఆమె ఆరోపించారు.

రోజా ఫిర్యాదుతో 30 మంది కార్యకర్తలను పుత్తురు పోలీసులు అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు. అయితే తమపై అక్రమ కేసులు పెట్టిన రోజాపై తాము ఎస్సీ, ఎస్టీ కేసులు పెడతామంటున్నారు వైసీపీ కార్యకర్తలు. ఓట్లు వేసి గెలిపిస్తే తిరిగి కేసులు పెడితే ఎలా అని నిలదీస్తున్నారు.

నగరి నియోజకవర్గంలో తారాస్థాయికి చేరుకున్న ఈవర్గ విభేదాలు ఎటువైపు వెళ్తాయో చూడాలి.. వైసీపీ అధిష్టానం దీనీపై త్వరగా దృష్టి పెడితే పరవలేదు.. లేదంటే పార్టీకి భారీగా డామేజ్‌ తప్పకపోవచ్చు.

Tags

Next Story