ప్రజలకు అండగా ఉంటా.. పోలీసులు ఏం చేస్తారో చూస్తా: చంద్రబాబు

ప్రజలకు అండగా ఉంటా.. పోలీసులు ఏం చేస్తారో చూస్తా: చంద్రబాబు

chandrababu

రాజధాని ఉద్యమాన్ని పోలీసులతో అణచివేయాలని చూస్తే ప్రజా తిరుగుబాటు తప్పదని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. వెంకటపాలెంలో మృతిచెందిన రైతు వెంకటేశ్వరరావు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. గత ఏడు నెలలుగా రాష్ట్ర ప్రజలు ఏ పండుగ జరుపుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమం చేస్తున్న ప్రజలకు అండగా ఉంటానని.. పోలీసులు ఏం చేస్తారో తాను చూస్తానన్నారు.

మందడంలోని జల్లెడ గోవిందం అనే రైతు కుటుంబాన్ని చంద్రబాబు పరామర్శించారు. రాజధాని తరలిపోతుందనే ఆవేదనతో.. మానసిక ఒత్తిడికి గురైన గోవిందం ఉద్యమం చేస్తూనే మృతి చెందారు. ఒక ఉన్మాది పాలనలో పోలీసులు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చంద్రబాబు మండిపడ్డారు. అభద్రతతో రైతులు చనిపోయే పరిస్థితి వచ్చిందన్నారు.

మధ్యాహ్నం నుంచి సాయత్రం వరకు చంద్రబాబు పరామర్శ యాత్ర కొనసాగింది. దొండపాడులోని మల్లి ఖార్జున్‌ అనే రైతు మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కన్నీరు మున్నీరు అవుతున్న ఆ కుటుంబ సభ్యులను ఓదార్చారు. రైతుల కోసం తాను జైలుకు వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నానని అన్నారు.

మందడంలో ఆందోళన చేస్తున్న మహిళా రైతుల దగ్గరకు వెళ్లి చంద్రబాబు సంఘీభావం తెలిపారు. అగ్రిమెంట్ ప్రకారం రాజధాని ఇక్కడే ఉండాలని.. మూడు రాజధానులు పెట్టడానికి వీలు లేదని తేల్చిచెప్పారు. పెయిడ్‌ ఆర్టిస్టులంటూ రైతుల ఆందోళనను హేళన చేస్తున్నారని బాబు ధ్వజమెత్తారు. ధర్నాలు, ర్యాలీలు చేయకుండా ఆంక్షలు పెట్టారని.. తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. మహిళల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజధాని తరలిపోతుందనే ఆవేదన రైతుల్లో రోజు రోజుకూ పెరిగిపోతోంది. మరో రైతు గుండెపోటుతో మృతి చెందాడు. వెలగపూడికి చెందిన కారు మంచి గోపాల్‌రావు ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.

ఇప్పటికే న్యూ ఇయర్‌ వేడుకలకు దూరంగా ఉన్న చంద్రబాబు.. సంక్రాంతి వేడుకలకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రతి ఏడాది ఆయన కచ్చితంగా సంక్రాంతి పండుగ సందర్భంగా నారావారి పల్లె వెళ్తుంటారు. కానీ రైతులకు జరుగుతున్న అన్యాయానికి నిరసగా అమరావతిలోనే ఉంటారని తెలుస్తోంది.

Tags

Next Story