సీఎం జగన్‌కు.. బీజేపీ ఎంపీ సుజనా చౌదరి లేఖ

సీఎం జగన్‌కు.. బీజేపీ ఎంపీ సుజనా చౌదరి లేఖ

suja

వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశాన్ని రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి తీవ్రంగా తప్పుబట్టారు. రాజధాని మార్పు పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సీఎం జగన్మోహన్ రెడ్డికి సుదీర్ఘ లేఖ రాశారు. 2014లో రాజధాని అమరావతి నిర్ణయాన్ని అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించిన విషయాన్ని గుర్తు చేశారు. సీఎం జగన్‌ బాధ్యతలు స్వీకరించాక అమరావతిలో 42 వేల కోట్ల పనుల్ని కారణం లేకుండా నిలిపివేశారని సుజనాచౌదరి తెలిపారు.

విశాఖపట్నంలో పాలనా రాజధాని ఏర్పాటు కోసం భవనాలు వెతుకుతున్నట్టు మంత్రుల ప్రకటనలు, రాజధానిలో ఆందోళనలు బాధ కల్గిస్తున్నాయని సుజనా చౌదరి లేఖలో పేర్కొన్నారు. రాజధాని మార్పు వల్ల తలెత్తే దుష్పరిణామాలను సుజనా చౌదరి తన లేఖలో ఎత్తిచూపారు. రాజధాని తరలింపు ఆర్థికంగా, న్యాయపరంగా దుష్ఫ్రరిణామాలను చూపిస్తుందని.. రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా తరలింపు నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని సూచించారు.

12 శాతం భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, 88 శాతం భూముల్ని నిరుపయోగంగా మారుస్తారా అంటూ ప్రశ్నించారు. ఇన్ సైడ్ ట్రేడింగ్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని తాను ఎన్నోసార్లు సీఎం జగన్మోహన్ రెడ్డిని కోరినట్టు లేఖలో స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణం కోసం లక్ష కోట్ల రూపాయలు అవుతుందన్న వాదన కూడా నిజంకాదన్న ఆయన.. మూడు రాజధానులు ఆచరణ సాధ్యం కాదని తెలిపారు.

రాజధాని తరలిస్తే రైతులకు నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుందని.. లక్షా 89 వేల 117 కోట్ల రూపాయలను రైతులకు చెల్లించాల్సి ఉంటుందని లేఖలో పేర్కొన్నారు సుజనా చౌదరి. రాజకీయాలను పక్కనపెట్టి భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా నిర్ణయాలు తీసుకోవాలని సీఎం జగన్మోహన్ రెడ్డికి సూచించారు. చెట్టును రక్షిస్తే అది మనకు నీడనిస్తుందని.. అలాగే, అమరావతిని రక్షిస్తే అది రాష్ట్రానికి ఆర్థిక రక్షణ కల్పిస్తుందని తెలిపారు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని సీఎం జగన్మోహన్ రెడ్డికి సూచించారు సుజనా చౌదరి.

Tags

Read MoreRead Less
Next Story