సోమవారానికి వాయిదా పడ్డ ఏపీ కేబినెట్ మీటింగ్
ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగాల్సి ఉంది. దీనికి సంబంధించి సీఎస్ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీచేశారు. అయితే, ఉన్నట్టుండి ఈ భేటీ ఈనెల 20వ తేదీకి వాయిదా పడింది. రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరించడానికి సోమవారం వరకు గడువు పొడిగించిన నేపథ్యంలో సమావేశాన్ని వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. రాజధాని రైతుల అభ్యంతరాలు కొలిక్కి రాకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కేబినెట్ భేటీ వాయిదాకు సంబంధించిన సమాచారం రాత్రి పొద్దుపోయిన తర్వాత మంత్రులు, అధికారులకు చేరింది.
మొదట 18న కేబినెట్ భేటీ, 20న అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని గత నెలలోనే షెడ్యూల్ ప్రకటించారు. ఆ తర్వాత కేబినెట్, అసెంబ్లీ రెండూ సోమవారమే ఉంటాయని సీఎస్ ఉత్తర్వులు జారీచేశారు. మళ్లీ శనివారం చకచకా మార్పులు జరిగిపోయాయి. సీఎం జగన్ క్యాంప్ కార్యాలయంలో హైపవర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ భేటీ ముగిసిన తర్వాత శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు కేబినెట్ సమావేశం జరుగుతుందని ఉత్తర్వులు వెలువడ్డాయి. రాజధానిపై హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికను కేబినెట్‌లో ఆమోదించిన తర్వాత అసెంబ్లీలో చర్చించాల్సి ఉన్న నేపథ్యంలో నివేదికపై అధ్యయనం చేసేందుకు వీలుగా ఈనిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే, కేబినెట్ భేటీ వాయిదా పడినట్లు శనివారం అర్థరాత్రి సమయంలో సమాచారం వచ్చింది.
అటు ఈనెల 20న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అదేరోజు ఉదయం కేబినెట్ సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కేబినెట్ భేటీకి ముందే హైపవర్ కమిటీ కూడా తమ నివేదికను ముఖ్యమంత్రికి అందజేసే అవకాశం ఉంది. ఈ నివేదికపై కేబినెట్ సమావేశంలో చర్చిస్తారని సమాచారం. మూడు రాజధానుల అంశంపై రాష్ట్రంలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో కేబినెట్‌లో నిర్ణయం తీసుకుని అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com