పంతం నెగ్గించుకున్న ఏపీ ప్రభుత్వం

పంతం నెగ్గించుకున్న ఏపీ ప్రభుత్వం

buggana-rajendranadhreddy

ప్రభుత్వం పంతం నెగ్గించుకుంది. ముందుగా చెప్పినట్లుగానే 3 రాజధానులు ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అసెంబ్లీలో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా విశాఖ, లెజిస్లేటివ్‌ రాజధానిగా అమరావతి, జ్యుడిషియల్ రాజధానిగా కర్నూలు ఉంటాయని మంత్రి బుగ్గన ప్రకటించారు. విశాఖలోనే సచివాలయం, రాజ్‌భవన్, హెచ్‌వోడీ కార్యాలయాలు ఉంటాయని చెప్పారు. అమరావతిలో చట్టసభలు, కర్నూలులో హైకోర్టుతోపాటు న్యాయపరమైన శాఖలన్నీ ఉంటాయని తెలిపారు. అసెంబ్లీలో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన.. ఇది చారిత్రాత్మకమైన బిల్లు అని అన్నారు. పరిపాలనను వికేంద్రీకరించడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం అన్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మూడు నుంచి నాలుగు జిల్లాలకో అభివృద్ధి మండలి ఉంటుందని తెలిపారు. 13 జిల్లాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి బుగ్గన.

రాజధానిపై గత ప్రభుత్వం.. రాజకీయ, వ్యాపారస్తులతో కమిటీ వేసిందని విమర్శించారు మంత్రి బుగ్గన. ఏం అనుభవం ఉందని నారాయణతో కమిటీ వేశారని ప్రశ్నించారు.? ఓవైపు శివరామకృష్ణన్ కమిటీని రాష్ట్రంలో పర్యటిస్తుండగానే.. నారాయణ కమిటీ వేశారని ఆరోపించారు. శివరామకృష్ణన్‌ కమిటీ రిపోర్టును కనీసం అసెంబ్లీ ముందుకు కూడా తీసుకురాలేదన్నారు.

చంద్రబాబు చూపించిన గ్రాఫిక్స్ లాంటి నగరం కట్టాలంటే.. ప్రతి 10 వేల మందికి 3.5 వేల కోట్లు కావాలన్నారు మంత్రి బుగ్గన. వరద వస్తే 70శాతం అమరావతి మునిగిపోతుందని చెప్పారు. రాష్ట్రానికి లక్షా 40 వేల కోట్ల రెవిన్యూ లోటు ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క నగరానికి ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం అవసరమా అని ప్రశ్నించారు బుగ్గన.

అమరావతిలో మాజీ సీఎం చంద్రబాబు హెరిటేజ్ ఫుడ్స్ పేరుతో 14.25 ఎకరాల భూమిని కొన్నారని ఆరోపించారు మంత్రి బుగ్గన. మొత్తం రాజధాని ప్రాంతంలో టీడీపీ నేతలు 4 వేల 70 ఎకరాలకు పైగా కొనుగోలు చేశారని అన్నారు. అమరావతిలో రాజధాని ఏర్పాటుకు సంబంధించిన నోటిఫికేషన్ రాకముందే వీళ్లంతా భూములు కొనుగోలు చేశారని చెప్పారు. ఏయే నేతలు ఎంత భూములు కొన్నారో చదివి వినిపించారు. టీడీపీ నేతలంతా కలసి మొత్తం 40 వేల కోట్ల కుంభకోణం చేశారని ఆరోపించారు మంత్రి బుగ్గన. అమరావతిలో ఎక్కువ భూములు కొన్నిది జీవీ ఆంజనేయులే అని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story