తారా స్థాయికి చేరిన అమరావతి పోరాటం.. ఎక్కడికక్కడ టీడీపీ నేతలు అరెస్ట్
అమరావతి పోరాటం తారాస్థాయికి చేరింది. రాజధాని తరలింపును ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ప్రతిఘటించింది. మూడు రాజధానులు ఏర్పాటుపై టీడీపీ భగ్గుమంది. అమరావతి జేఏసీ నాయకులతో కలసి అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించింది. ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు అసెంబ్లీ ముట్టడిలో పాల్గొన్నారు. టీడీపీ నేతల ప్రయత్నాలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయిప్పటికీ టీడీపీ నాయకులు వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో పోలీసులు, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది.
హోంమంత్రి సుచరిత ఇంటిని టీడీపీ శ్రేణులు ముట్టడించాయి. మాజీ మంత్రి ఆలపాటి రాజా, టీడీపీ నేతలు.. సుచరిత ఇంటి ముందు బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి దేవినేని ఇంటి వద్ద హైటెన్షన్ ఏర్పడింది. అసెంబ్లీ ముట్టడిలో పాల్గొనడానికి దేవినేని ఉమ ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అయితే, దేవినేని ఉమ పోలీసుల కన్నుగప్పి అసెంబ్లీవైపు దూసుకొచ్చారు.
గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అరెస్టు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. రాజధాని తరలింపును తరలిస్తూ ర్యాలీగా వచ్చిన గల్లా జయదేవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం, పోలీసుల తీరుపై గల్లా జయదేవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలీసుల తీరు దారుణంగా ఉందని దుయ్యబట్టారు. మహిళలను కూడా విచక్షణారహితం గా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, చోటా-మోటా నాయకులను ఎవ్వరినీ వదిలిపెట్టలేదు. గుంటూరులో మాజీ మంత్రి నక్కా ఆనందబాబును.. విశాఖలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణను హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నెల్లూరులో మాజీ ఎమ్మెల్యేలు రామకృష్ణ, పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సహా పదుల సంఖ్యలో నాయకులను నిర్బంధించారు. గుంటూరులో టీడీపీ నేత జీవీ ఆంజనేయులును గృహ నిర్బంధం చేశారు. రాష్ట్ర నీటి సంఘాల నాయకుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావును గృహ నిర్బంధం చేశారు.
రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లోనూ ఆందోళనలు వెల్లువెత్తాయి. తూర్పుగోదావరి జిల్లాలో నిరసనలు హోరెత్తాయి. జగ్గంపేట నియోజకవర్గ పరిధిలోని రామవరం సమీపంలో ప్రజలు జాతీయ రహదారి ని దిగ్బంధించారు. ఆందోళనకారులు రోడ్లపై టైర్లు కాల్చి నిరసన తెలిపారు. మూడు రాజధానులు వద్దు-ఒక్క రాజధానే ముద్దు అంటూ నినదించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com