27న జరగబోయే ఏపీ కేబినేట్ పై తీవ్ర ఉత్కంఠ

27న జరగబోయే ఏపీ కేబినేట్ పై తీవ్ర ఉత్కంఠ

ఏపీ కేబినెట్ సోమవారం సమావేశం కానుంది. శాసనమండలి ఉండాలా ? రద్దు చేయాలా? అనే అంశంపై అసెంబ్లీలో చర్చిద్దామని ఏపీ సీఎం జగన్ ప్రకటన చేసిన నేపథ్యంలో.. ఈనెల 27న జరిగే ఏపీ కేబినెట్ భేటీపై ఉత్కంఠ నెలకొంది. ఆ రోజు ఉదయం 9.30 గంటలకు జరగబోయే మంత్రివర్గ సమావేశంలో మండలి రద్దు అంశంపై కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదే రోజు ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశం ప్రారంభం కానుంది. కేబినెట్‌లో మండలి రద్దు నిర్ణయం తీసుకుని.. ఆ వెంటనే దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపే యోచనలో ఉంది వైసీపీ ప్రభుత్వం.

ఏపీలో మూడు రాజధానులకు సంబంధించిన బిల్లును శాసనసభ ఆమోదించినా.. మండలిలో ఆ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని చైర్మన్ నిర్ణయించడంపై వైసీపీ ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. మండలి చైర్మన్, టీడీపీ సభ్యుల తీరును తీవ్రంగా తప్పుబట్టిన సీఎం జగన్‌ అసలు మండలి అవసరమా? అనే చర్చకు తెరలేపారు. దీనిపై సోమవారం చర్చించి నిర్ణయం తీసుకుందామని జగన్ ప్రకటించడంతో.. ఆ రోజే మండలి రద్దుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జోరందుకుంది.

Tags

Read MoreRead Less
Next Story