రాజ్యాంగం.. మండలి రద్దు అధికారాన్ని అసెంబ్లీకే ఇచ్చింది: సీఎం జగన్

రాజ్యాంగం.. మండలి రద్దు అధికారాన్ని అసెంబ్లీకే ఇచ్చింది: సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ.. శాసనమండలి రద్దు తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. సభకు హాజరైన 133 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. అనంతరం మండలి రద్దు తీర్మానం ఆమోదం పొందినట్లు స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రకటించారు.

మూడు రాజధానుల బిల్లును శాసనమండలి సెలెక్ట్‌ కమిటీకి పంపడం ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. పెద్దల సభను రద్దు చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఆ తీర్మానానికి తొలుత మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అనంతరం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రోజంతా చర్చ జరిగింది. ప్రజల కోసం ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాలను రాజకీయ కారణాలతో మండలి అడ్డుకోవడం దారుణం అని అన్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. అలాంటి సభ కోసం ప్రజాధనం ఖర్చు చేయడం దండగ అన్నారాయన.

మండలి రద్దు అధికారాన్ని రాజ్యాంగం అసెంబ్లీకే ఇచ్చిందని సీఎం గుర్తుచేశారు. కొన్నాళ్లు పోతే అక్కడ వైసీపీకే ఆధిక్యం వస్తుందని.. అయినా కీలక బిల్లులపై కాలయాపన తప్ప ఒరిగేదేమీ లేదన్నారు. అలాంటి సభను రద్దు చేయాలని తీర్మానం పెట్టడం సంతోషంగా ఉందని జగన్ స్పష్టంచేశారు.

అసెంబ్లీకి 133 మంది సభ్యులు హాజరయ్యారు. ఓటింగ్ సందర్భంగా తొలుత ఎమ్మెల్యేలు కాని మంత్రులు మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్‌ను పక్కన కూర్చోవాలని స్పీకర్ సూచించారు. అనంతరం ఓటింగ్ చేపట్టారు. జనసేన ఎమ్మెల్యే రాపాక సైతం తీర్మానానికి అనుకూల ఓటు వేశారు. ఏకగ్రీవ ఆమోదం పొందిన ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్నారు. పార్లమెంట్‌ ఉభయ సభలతో పాటు, రాష్ట్రపతి ఆమోదం తెలిపిన అనంతరం మండలి పూర్తిగా రద్దు అవుతుంది.

Tags

Read MoreRead Less
Next Story