మరో సూపర్ ఓవర్.. మరో సూపర్ విజయం.. సూపర్ టీమిండియా

మరో సూపర్ ఓవర్.. మరో సూపర్ విజయం.. సూపర్ టీమిండియా

సూపర్ ఓవర్ మరోసారి న్యూజిలాండ్‌కు అచ్చిరాలేదు. వెల్లింగ్టన్ టీ-20లోనూ టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. 14 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగింది టీమిండియా. కేఎల్‌ రాహుల్, కోహ్లీ ఓపెనర్లుగా వచ్చారు. తొలి బంతికే అద్భుతమైన సిక్స్‌ కొట్టాడు రాహుల్. రెండో బాల్‌ను ఫోర్‌గా మలిచాడు. అయితే మరో భారీ షాట్‌తో ఇన్నింగ్స్‌ను ముగిద్దామనుకున్న రాహుల్ బౌండరీలైన్ వద్ద దొరికిపోయాడు. నాలుగో బంతికి కెప్టెన్ కోహ్లీ 2 పరుగులు తీశాడు. ఐదో బాల్‌ను ఫోర్‌గా మలిచిన కోహ్లీ టీమిండియాకు సూపర్ విక్టరీ అందించాడు. అలా మరో బాల్ మిగిలి ఉండగానే టీమిండియా విజయం సాధించింది. ఈ సిరీస్‌లో ఇది వరుసగా రెండో టై. మూడో టీ-20 కూడా టై అయింది. ఆ మ్యాచ్‌లోనూ సూపర్‌ ఓవర్లో విజయం సాధించింది కోహ్లీసేన. అసలు ఒక సిరీస్‌లో ఒక మ్యాచ్ టై అవ్వడమే చాలా అరుదు. అలాంటిది ఈ సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లు టై అవ్వడం రెండింటిలోనూ టీమిండియానే గెలుపొందడం విశేషం. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 4-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన కోహ్లీసేన క్వీన్‌స్వీప్‌పై కన్నేసింది.

అటు న్యూజిలాండ్‌కు సూపర్ ఓవర్ మరోసారి నిరాశే మిగిల్చింది. ఇప్పటి వరకు కివీస్ మొత్తం 8 సూపర్ ఓవర్లు ఆడగా ఏడు సార్లు ఓడిపోయింది. మాకు సూపర్‌ ఓవర్లు అసలే అచ్చిరావని ఆ టీమ్ కెప్టెన్ విలియం సన్ చెప్పినట్లుగానే మరోసారి జరిగింది.

సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 13 రన్స్ చేసింది. తొలి బాల్‌కు 2 రన్స్ వచ్చాయి. ఆ తర్వాత 4, 2 పరుగులు వచ్చాయి. నాలుగో బంతికి వికెట్ కోల్పోయింది కివీస్. మళ్లీ ఐదో బందికి ఫోర్ వచ్చింది. చివరి బాల్‌కు ఒక పరుగు మాత్రమే రావండతో 13 రన్స్ చేసింది న్యూజిలాండ్.

అంతకుముందు టాస్‌ గెలిచిన న్యూజిలాండ్ టీమిండియాకు బ్యాటింగ్ అప్పగించింది. దాటిగా ఆడే క్రమంలో వికెట్లు కోల్పోయింది కోహ్లీసేన. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 165 రన్స్ మాత్రమే చేసింది. మనీష్ పాండే 50 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. ఓపెనర్ రాహుల్ 39 పరుగులు చేశాడు.. మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ పెద్దగా రాణించలేదు.

166 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ మొదట దాటిగానే ఆడింది. అయితే ఎప్పటిలాగే చివర్లో మరోసారి తడబడింది. చేజేతులా మ్యాచ్‌ను సూపర్ ఓవర్‌ వరకూ తెచ్చుకుంది. ఆఖరి ఓవర్లో కేవలం 7 పరుగు చేయాల్సిన పరిస్థితిలో వరుసగా వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. చివరి బాల్‌కు 2 పరుగులు అవసరం కాగా ఒక్క రన్ మాత్రమే వచ్చింది.. మరో పరుగు కోసం ప్రయత్నించినప్పటికీ రనౌట్ అవ్వడంతో మ్యాచ్ టై అయింది. అటు లాస్ట్‌ ఓవర్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లు తీశాడు. మరో ఇద్దరు రనౌట్ అయ్యారు. అంటే చివరి ఓవర్లో న్యూజిలాండ్ మొత్తం 4 వికెట్లు కోల్పోయింది.

Tags

Next Story