విటమిన్ బీ మాత్రలో సైనేడ్ కలిపి భార్యను హత్య చేసిన భర్త
అతనో బడా బ్యాంకుకు మేనేజర్. జీవితంలో ఉన్నతంగానే సెటిల్ అయ్యాడు. మంచి కట్నం తీసుకుని పెళ్లి చేసుకున్నాడు. కానీ వివాహేతర సంబంధం అతనిలో శాడిజం బుసలు కొట్టేలా చేసింది. వివాహేతర సంబంధానికి అడ్డుస్తోందనే కారణంతో ఏకంగా భార్యనే హతమార్చాడా ప్రభుద్ధుడు. ముంబై నుంచి సైనైడ్ తెప్పించి.. దాన్ని తన భార్య వాడే బీ కాంప్లెక్స్ క్యాప్సిల్స్‌లో నింపి పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేశాడు. ఐదు రోజుల క్రితం చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.
తిరుపతి పట్టణానికి చెందిన త్రినాథుడు, విజయభారతిల కుమారుడు రవిచైతన్య మదనపల్లి పట్టణంలోని బరోడా బ్యాంకులో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. రవిచైతన్యకు కృష్ణా జిల్లాకు చెందిన నాగేంద్రరావు కుమార్తె ఆమనితో వివాహం జరిగింది. కానీ కొన్ని రోజుల తరువాత రవిచైతన్య బుద్ది గడ్డితింది. బెంగళూరుకు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం భార్య ఆమనికి తెలిసింది. దీంతో ఇద్దరి మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుత్నాయి. అంతేకాదు రవిచైతన్యతో పాటు అతని తల్లిదండ్రులు అదనపు కట్నం కావాలంటూ ఆమనిని వేధించారు. ఈ క్రమంలో గత నెల 27వ తేదీన ఆమని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
అదే రోజు ఆమని మృతదేహాన్ని స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించగా ఆమె మరణంపై డాక్టర్లు అనుమానం వ్యక్తం చేశారు. హత్య విషయం ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతో తన భార్య గుండెపోటుతో మృతి చెందిందని.. మృతదేహాన్ని ఇస్తే తీసుకెళ్తానని పట్టుబట్టాడు. దీంతో మరింత అనుమానం వ్యక్తం చేసిన డాక్టర్లు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టడంతో.. విస్మయం కలిగించే నిజాలు బయటపడ్డాయి. ఎలాగైనా భార్యను హతమార్చాలని నిర్ణయించుకున్న రవిచైతన్య.. ఆమె వేసుకునే క్యాప్సిల్స్‌లో సైనైడ్ కలిపి హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com