నగరిలో రచ్చకెక్కిన వైసీపీ ఇంటిపోరు.. మసకబారుతున్న రోజా పాపులారిటీ

నగరిలో రచ్చకెక్కిన వైసీపీ ఇంటిపోరు.. మసకబారుతున్న రోజా పాపులారిటీ

ఆర్కే రోజా.. ఏపీ రాజకీయాల్లో ఫైర్‌ బ్రాండ్ గా ముద్రవేయించుకున్న పేరు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి.. సీఎం జగన్ మోహన్‌ రెడ్డి వరకు.. వైసీపీ అధిష్టానం వద్ద వెరీ పవర్‌ ఫుల్‌ లేడీ లీడర్. కానీ, ఇదంతా గతం. పార్టీలో ఆమె పలుకుబడి అంతకంతకూ తగ్గిపోతోందని.. చిత్తూరు జిల్లా రాజకీయాలు కోడై కోస్తున్నాయి. వర్గపోరు, అంతర్గత విభేదాలు.. రోజా పాపులారిటీని మసకబారుస్తున్నాయి. నగరిలో రోజాకు వ్యతిరేక పవనాలు.. రోజురోజుకూ బలపడుతున్నాయి.

రోజా ప్రాతినిథ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గంలో అంతర్గత విభేదాలు బట్టబయలయ్యాయి. మునుపెన్నడూ లేనంతగా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. దీనికంతటికీ రోజా వ్యవహార శైలే కారణమంటోంది ఆమె వ్యతిరేక వర్గం. తనను నిలదీస్తే.. ఎవరినైనా దూరం పెట్టేందుకు రోజా వెనుకాడటం లేదట. ఈ వైఖరే ఇప్పుడు వైసీపీలో అంతర్గత పోరుకు బాటలు వేసిందంటున్నారు.

శుక్రవారం జరిగిన కె.జె.కుమార్ షష్టిపూర్తి సంధర్బంగా.. రోజా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఓ ఫోన్ సంబాషణ బయటపడింది. దీంతో నగరిలో వైసీపీ రెండుగా చీలిపోతున్న సంకేతాలు వెలువడ్డాయి. అధిష్టానం వద్ద తమకు పలుకుబడి ఉందని.. ఈ విషయాన్ని అధిష్టానం వద్దే తేల్చుకుంటామని రోజా వ్యతిరేకవర్గం అంటోంది. నగరిలో రోజా గెలిచినప్పటి నుంచి కొద్దిరోజులు మాత్రమే దగ్గరున్న కె.జె.కుమార్ వర్గం.. ఆ తర్వాత దూరమైపోయింది. దీనికి కారణం రోజా అన్నదమ్ములు, భర్త, భర్త తరపున బంధువేనన్న ఆరోపణలున్నాయి.

రోజా నియోజకవర్గంలో ప్రస్తుతం ఎక్కడా తనకు అనుకూల పరిస్థితులు కనిపించడం లేదు. పదేళ్ళుగా పార్టీ కోసం తాము పనిచేశానని.. సొంత చెల్లెలు, కూతురి కంటే ఎక్కువగా చూసుకున్నామని.. అయితే, చెప్పుడు మాటల్ని విని తమను దూరం చేసుకుంటోందని కె.జె.వర్గం ఆరోపిస్తోంది. కె.జె.కుమార్ ను కాదని మరో వర్గానికి చోటివ్వడంతో.. నెలరోజుల క్రితం ఓ గ్రామంలో ఆమెను అడ్డుకున్నారు. ఇలా.. కొత్తవారిని అందలం ఎక్కించి పాత వారిని పక్కనబెట్టడంతో.. ఓ వర్గం ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి దాపురించింది.

పార్టీ కోసం ప్రాణాలకు తెగించి కష్టపడిన వారిని గుర్తించకుండా.. అధికారంలోకి రాగానే రోజా మరో వర్గాన్ని వెంటబెట్టుకుని తిరగడంతో కె.జె.కుమార్ వర్గం అసహనానికి గురైంది. టీడీపీ హయాంలో రోజా కోసం తామంతా జైలుకు వెళ్ళొచ్చామని.. అయినప్పటికీ కనికరం లేకుండా అధికారంలోకి రాగానే తమను పక్కన బెట్టిందనే ఆవేదన కె.జె. కుమార్ వర్గంలో వ్యక్తమవుతోంది.

పార్టీలోకి కొత్తగా వచ్చిన వారిని పక్కన బెట్టుకుని తిరుగుతుండటమే కాకుండా.. కె.జె. కుమార్ వర్గానికి దూరంగా వుండాలని తన వర్గం నాయకులు రోజా చెబుతుండటం వివాదానికి కారణమైంది. కె.జె.కుమార్ షష్టిపూర్తికి హాజరైతే.. వారిపై చర్యలు తీసుకుంటామన్న రోజా ఆడియో క్లిప్ ఒకటి బయటికిరావడంతో.. నగరిలో వైసీపీ వర్గపోరు రాజకుంది.

ఇప్పటికే ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. సరిగ్గా ఇదే సమయంలో రోజా ఆడియో బయటికి రావడంతో పరిస్థితి మరింత జఠిలం కానుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పదేళ్ళుగా వైసీపీకి అండగా ఉంటూ.. పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేసిన వారిని పక్కనబెట్టిందని కె.జె. కుమార్ వర్గం ఆరోపిస్తోంది. ఈ వివాదం మరింత ముదిరే అవకాశం వుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story