విశాఖలో ప్రభుత్వం చేపట్టిన ల్యాండ్ పూలింగ్‌కి అడుగడుగునా అడ్డంకులు

విశాఖలో ప్రభుత్వం చేపట్టిన ల్యాండ్ పూలింగ్‌కి అడుగడుగునా అడ్డంకులు

అమరావతిని అటకెక్కించి మూడు రాజధానల కోసం జపం చేస్తున్న వైసీపీ సర్కార్‌ కు.. అడుగడుగునా అవాంతరాలే ఎదురవుతున్నాయి. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలన్నీ బెడిసికొడుతున్నాయి. విశాఖ జిల్లాలో ల్యాండ్ పూలింగ్ పై వ్యతిరేకత రోజురోజుకీ పెరుగుతోంది. ప్రభుత్వం ఇప్పటికే సర్వేచేసిన ప్రతిపాదిత భూములను ఇవ్వడానికి రైతులు ససేమిరా అంటున్నారు. సాగులోవున్న భూమిని ఇచ్చేది లేదంటూ తెగేసి చెబుతున్నారు.

వైసీపీ ప్రభుత్వం తలపెట్టిన కార్యనిర్వహక రాజధాని ఎట్టిపరిస్థితుల్లోనూ కార్యరూపం దాల్చేలా లేదు. విశాఖలో ల్యాండ్ పూలింగ్‌ కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. భూములిచ్చేది లేదంటూ రైతులు తెగేసి చెబుతుండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

సాక్షాత్తు విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న.. భీమిలి నియోజకవర్గంలో ధిక్కార స్వరం బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా మూడు మండలాల్లో ఈ ధిక్కారధోరణి ప్రభుత్వానికి సవాలుగా మారింది. వేరొకరికిచ్చే ఇళ్ల కోసం.. అన్నం పెడుతున్న భూములను ఎలా వదులుకుంటామంటూ.. అధికారులను నిలదీస్తున్నారు రైతులు.

విశాఖజిల్లాలోని పద్మనాభం, ఆనందపురం, భీమిలి మండలాల్లో.. విఎమ్మార్డీఏ, రెవెన్యూ అధికారులు కలిసి చేపట్టిన ల్యాండ్ పూలింగ్ లో అడుగడుగునా అవాంతరాలు తప్పడంలేదు. పద్మనాభం మండలం తుని వలసలో 37 ఎకరాల భూసేకరణ కోసం అధికారులు నిర్వహించిన గ్రామ సభ అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది.

34 కుటుంబాలకు చెందిన రైతులు సదరుభూమిలో ఏళ్లతరబడి సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు ఆ భూమిని ల్యాండ్ పూలింగ్ కోసం ప్రభుత్వం గుర్తించింది. ఇందులో భాగంగా భూసేకరణ కోసం వచ్చిన అధికారులకు వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు. ప్రాణాలు పోయినా తమ భూమి ఇచ్చేది లేదంటూ తెగేసి చెప్పారు.

ఇక, భీమిలి మండలంలోనూ ఇదే పరిస్ధితి. మండలంలోని ఆరు గ్రామాల్లో ల్యాండ్ పోలింగ్ కు రంగం సిద్దం చేశారు అధికారులు. అయితే, భూమిలివ్వడానికి రైతులు ససేమిరా అన్నారు. ప్రతిపాదిత 466 ఎకరాల్లో సాగులో వున్న భూమిని ఎలా ఇస్తామంటూ అధికారులను నిలదీశారు.

ఆనందపురం మండలంలో కూడా ల్యాండ్ పోలింగ్ ను రైతులు తిరస్కరించారు. తమ స్థలాలు వదులుకునేది లేదని అధికారులకు తెగేసి చెప్పారు.

అటు.. అనకాపల్లి మండలం మామిడి పాలెం గ్రామంలోనూ అధికారులకు చుక్కెదురైంది. భూసేకరణకు వచ్చిన ఆర్డీవో సీతారాం, ఎమ్మార్వో వై.వి.ఎస్.ఎస్. ప్రసాద్ ల వాహనాలను గ్రామస్తులు అడ్డుకున్నారు. ల్యాండ్ పూలింగ్ ఆపేయాలంటూ ఆందోళన చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములిచ్చే ప్రసక్తే లేదంటూ.. ల్యాండ్ పూలింగ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అనకాపల్లి మండలం కుంచంగి గ్రామంలో ల్యాండ్ పూలింగ్ కోసం వచ్చిన అధికారులకు, గ్రామ ప్రజలు మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగింది. ఇళ్ల స్థలాల కోసం 300 ఎకరాల భూమని సమీకరించేందుకు.. కుంచంగిలో గ్రామ సభ నిర్వహించారు. అయితే, రైతుల నుంచి పెద్దయెత్తున వ్యతిరేకత ఎదురుకావడంతో అవాక్కయ్యారు.

ల్యాండ్ పూలింగ్ విషయంలో ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని గ్రామ సభలో రైతులు అసహనం వ్యక్తం చేశారు. భూమి ఇచ్చేది లేదని అధికారులకు ముఖం మీదే చెప్పేశారు. ఈ క్రమంలో ఆర్డీవో సీతారామారావుతో కొంతమంది రైతులు వాగ్వాదానికి దిగడంతో ఆయన సభ మధ్యలోనే వెళ్లిపోయారు. దీంతో భూసేకరణకు వచ్చిన అధికారులు బిక్కమొహం వేయాల్సి వచ్చింది.

మొత్తానికి విశాఖలో కార్యనిర్వహక రాజధాని కోసం.. ఆగమేఘాల మీద ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలన్నీ బెడిసికొడుతున్నాయి. దీంతో అధికారులు, వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story