కియాపై రాయిటర్స్ రాసిన కథనాలు నిజమే: చంద్రబాబు

కియాపై రాయిటర్స్ రాసిన కథనాలు నిజమే: చంద్రబాబు

కియా పరిశ్రమ తరలింపును తమిళనాడు అధికారులు ధృవీకరించారని స్పష్టం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. కియాపై రాయిటర్స్ రాసిన కథనాలు నిజమేనని చెప్పారు. కియా వల్ల 12వేల మందికి ఉద్యోగాలు వచ్చాయని.. దాదాపు రూ.13,500 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని అన్నారు. అలాంటి సంస్థ వైసీపీ ప్రభుత్వ తీరుకు భయపడిపోయి తమ ప్లాంట్‌ను తరలించాలనుకుంటోందని చెప్పారు. కియా సంస్థ రాష్ట్రానికి ఊరికే రాలేదని.. ఎంతో కష్టపడ్డామని తెలిపారు చంద్రబాబు.

వైసీపీ ప్రభుత్వం తీరుపై చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. అంతర్జాతీయ కంపెనీతో వ్యవహరించే పద్ధతి ఇదేనా? అని ప్రశ్నించారు. కంపెనీ సీఈవోను ఓ ఎంపీ బెదిరిస్తే.. కొత్త కంపెనీలు ఏమైనా వస్తాయా? అని అన్నారు. తమ వాళ్లకే ఉద్యోగాలు ఇవ్వాలంటూ వైసీపీ నాయకులు బెదిరించారని మండిపడ్డారు. కియాకు రాయితీ ప్రోత్సాహకాలను సమీక్షిస్తామని మరో మంత్రి అన్నారని గుర్తుచేశారు. భూములు ఇవ్వొద్దని జగన్‌ కూడా రైతులను రెచ్చగొట్టారని ఆరోపించారు. నాడు బొత్స అవినీతి కారణంగా వోక్స్‌ వ్యాగన్‌ పుణెకు వెళ్లిందని చెప్పారు.

జగన్‌ పిచ్చి తుగ్గక్‌ నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థ కుదేలైందని మండిపడ్డారు చంద్రబాబు. మూడు రాజధానులంటూ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని విమర్శించారు. ఇలాంటి నిర్ణయాలు చూసే ఈ తుగ్లత్‌తో సమస్య తప్పదని కియా భయపడిందని ఆరోపించారు చంద్రబాబు. తప్పనిసరి పరిస్థితుల్లోనే మార్చాల్సి వస్తోందని కియా చెబుతోందంటే.. వీళ్ల వేధింపులు ఏస్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు.

ఏపీకి రావాల్సిన లక్షా 80 వేల కోట్లు పెట్టుబడులు వెనక్కి పోయాయని ఆరోపించారు చంద్రబాబు. ఆదానీ డేటా సెంటర్‌, లులు, పేపర్‌ మిల్లు, సింగపూర్‌ కంపెనీలు వెళ్లిపోయాయని అన్నారు. తమ హయాంలో దావోస్‌లో ఏపీ పేరు మార్మోగిపోయిందని.. ఇప్పుడు అసలు ఏపీ ప్రాతినిధ్యమే లేదని మండిపడ్డారు. విశాఖలో మిలీనియం టవర్స్‌లో కంపెనీలను వెళ్లగొట్టి సచివాలయం పెడతారా? అని ప్రశ్నించారు.

Tags

Next Story