దిశ చట్టం చరిత్రలో నిలిచిపోతుంది: సీఎం జగన్

దిశ చట్టం చరిత్రలో నిలిచిపోతుంది: సీఎం జగన్

దిశ చట్టం ప్రత్యేకమైందని, చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు ఏపీ సీఎం జగన్. వెంటనే శిక్ష పడుతుందన్న భయం ఉంటేనే అఘాయిత్యాలను ఆపగలుగుతామని చెప్పారు. నిర్భయ ఘటన జరిగి ఎనిమిదేళ్లైనా నిందితులకు ఇప్పటి వరకు శిక్ష అమలు కాలేదని అన్నారు. అందుకే చిన్నారులు, మహిళలపై అత్యాచారం జరిగితే 7 రోజుల్లోపే దర్యాప్తు పూర్తి చేసి 21 రోజుల్లోనే నిందితుడికి శిక్షపడేలా దిశ చట్టం రూపొందించామని వివరించారు. ఈ నెలాఖరు కల్లా 18 దిశ పోలీసు స్టేషన్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు సీఎం జగన్.

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘దిశ’ పోలీస్‌స్టేషన్‌ను ముఖ్యమంత్రి జగన్‌ ప్రారంభించారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన దిశ పోలీసు స్టేషనును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మేకతోటి సుచరిత, తానేటి వనిత, ఎమ్మెల్యే రోజా, మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ,డీజీపీ గౌతం సవాంగ్‌ పాల్గొన్నారు. అనంతరం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ‘దిశ’ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. అనంతరం అందరూ దిశ ప్లెడ్జ్ చేశారు..

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18 దిశ పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. ఒక్కో స్టేషన్‌లో ఇద్దరు డీఎస్పీలు, సీఐలు, ఐదుగురు ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లతో కలిపి మొత్తం 52 మంది సిబ్బంది ఉంటారు. దిశ చట్టంపై అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేయడం, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు IAS అధికారిణి కృతికా శుక్లా, ఐపీఎస్‌ అధికారి దీపికను ప్రభుత్వం ప్రత్యేక అధికారులుగా నియమించింది.

Tags

Read MoreRead Less
Next Story