16 నెలలు జైల్లో ఉన్న జగన్‌కు టీడీపీని విమర్శించే హక్కులేదు: యనమల

16 నెలలు జైల్లో ఉన్న జగన్‌కు టీడీపీని విమర్శించే హక్కులేదు: యనమల

ఐటీ దాడుల సాకుతో టీడీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. వైసీపీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. PAలు, PSలకు పార్టీతో ఏం సంబంధం ఉంటుందని యనమల సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌కు, టీడీపీతో ఏం సంబంధం ఉంటుందని నిలదీశారాయన. ఆస్తుల కేసు నుంచి తాను తప్పించుకోవడం.. ఎదుటి వాళ్లపై దాడులు చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని యనమల విమర్శించారు.

చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్‌ నివాసంలో ఐటీ దాడులు.. ఆయన వ్యక్తిగతం అన్నారు. అతనొక ప్రభుత్వ అధికారి మాత్రమే అన్నారాయన. వాటిని టీడీపీకి ముటిపెట్టడం బురద చల్లడమే అని విమర్శించారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో 10-15 మంది పీఎస్‌లు, పీఎలు పనిచేశారని గుర్తుచేశారు. వాళ్లపై ఐటీ దాడులు జరిగితే.. వాటిని పార్టీకి అంటగట్టడం హేయమని దుయ్యబట్టారు యనమల.

జగన్‌ ఆస్తుల కేసు విచారణ చివరి దశకు చేరిందని యనమల అన్నారు. 4 వేల కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ జప్తు చేసిందని గుర్తుచేశారు. ట్రయల్స్‌కు హాజరు కాకుండా జగన్‌ అందుకే ఎగ్గొడుతున్నారని యనమల ఆరోపించారు. శిక్ష తప్పదని జగన్‌కు తెలుసన్నారు. అందుకే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కోర్టుకు హాజరుకాకుండా మినహాయింపు కోరడం వెనుక మర్మం ఇదే అన్నారు. హైకోర్టులో సీబీఐ వేసిన పిటిషన్‌కు ముందు జగన్‌ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఎక్కడో, ఎవరో మాజీ పీఎస్‌పై ఐటీ దాడులను టీడీపీకి అంటగట్టడం ఏమిటని యనమల ప్రశ్నించారు. 16 నెలల జైలు.. 16 ఛార్జిషీట్లు ఉన్న జగన్‌కు టీడీపీని విమర్శించే నైతిక హక్కు ఎక్కడిదని నిలదీశారు. రివర్స్ టెండరింగ్‌లో కాంట్రాక్టు అప్పగించిన ఇన్‌ఫ్రా కంపెనీలో సోదాలు జరిగితే.. వాటికి టీడీపీకి సంబంధం ఏముంటుందని ప్రశ్నించారు. సోదాలు జరిగిన కంపెనీకు.. మీరు కాంట్రాక్టులు ఇవ్వలేదా అంటూ ప్రశ్నల పరంపర సంధించారు. మొదట జగన్‌పై ఉన్న అవినీతి ఆరోపణల సంగతి నిగ్గు తేల్చుకోండని హితవు పలికారు. ఏడాదిలో విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు చెప్పగా.. 8 ఏళ్లుగా మీరెందుకు అడ్డుకుంటున్నారని యనమల క్వశ్చన్ చేశారు. వాయిదాలకు మినహాయింపు కోరుతూ పదేపదే పిటిషన్లు ఎందుకు వేస్తున్నారని నిలదీశారాయన.

టీడీపీ, వైసీపీ.. ఏది ఎలాంటి పార్టీనో ప్రజలందరికీ తెలుసని యనమల అన్నారు. తప్పుడు పనిలు చేసే పార్టీ తమది కాదన్నారు. సామాజిక న్యాయం కోసం పోరాడిన పార్టీ కాబట్టే.. టీడీపీని 40 ఏళ్లుగా ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని గుర్తుచేశారు. అక్రమార్జన కాపాడుకోవడానికి పుట్టిన పార్టీగా వైసీపీని అభివర్ణించారు యనమల. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో నియోజకవర్గంలో వైసీపీ 30 కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. చంద్రబాబుపై గతంలోనే 26 ఎంక్వైరీలు వేశారని గుర్తు చేశారు. సభా సంఘాలు, న్యాయ విచారణలు, సీబీసీఐడీ అన్నా చేశారని అన్నారు. టీడీపీపై, చంద్రబాబుపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను యనమల ఖండించారు. విష ప్రచారం ఆపకపోతే.. న్యాయ పరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.

Tags

Next Story