సీఏఏకు పార్లమెంట్‌లో మద్దతిచ్చి.. ఇక్కడ వ్యతిరేకంగా ర్యాలీలు చేస్తున్నారు: సునీల్ దేవధర్

ఏపీ సీఎం జగన్ చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని విమర్శించారు బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్. ఇసుక విధానంతో పాటు.. చాలా ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. కేంద్రం ఎలాంటి సాయం చేయడం లేదని దుష్ర్పచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కేంద్ర మంత్రివర్గంలో చేరుతుందన్న వార్తలను సునీల్ దేవధర్ ఖండించారు. ఇప్పటికే రాష్ట్రంలో జనసేనతో పొత్తు పెట్టుకున్నామని.. స్థానిక ఎన్నికల్లో కూడా కలిసి పనిచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఇటీవల సీఎం జగన్ ప్రధాని మోదీని, హోం మంత్రి అమిత్‌షాను కలిశారని.. దానికి వేరే అర్థాలు తీసుకోవద్దని స్పష్టం చేశారు.
ఒక రాష్ట్రం-ఒక రాజధాని బీజేపీ విధానమని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్ స్పష్టం చేశారు. అమరావతికే బీజేపీ మద్దతని తెలిపారు. రాజధాని విషయంలో వైసీపీ-టీడీపీ మైండ్‌గేమ్ ఆడుతున్నాయని విమర్శించారు. 3 రాజధానుల నిర్ణయంతో అందరూ ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మండలి రద్దు కూడా ఏకపక్ష నిర్ణయమన్నారు సునీల్ దేవధర్. ప్రభుత్వం ఒంటెద్దు పోకడ పోతోందని ఆరోపించారు.
CAAకు పార్లమెంట్‌లో మద్దతు ఇచ్చి ఇప్పుడు వ్యతిరేకంగా ఎలా ర్యాలీలు చేపడుతారని వైసీపీని నిలదీశారు సునీల్ దేవధర్, వ్యతిరేక ఆందోళనలు, ర్యాలీలపై ఆ పార్టీ పెద్దలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com