రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ ఆకస్మిక దాడులు.. బయటపడ్డ పలు అక్రమాలు

రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ ఆకస్మిక దాడులు.. బయటపడ్డ పలు అక్రమాలు

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్, రెవెన్యూ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. శ్రీకాకుళం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని టౌన్‌ ప్లానింగ్‌ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అదికారులు తనిఖీలు చేశారు. టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో జరుగుతున్న అవినీతిపై ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో సోదాలు జరిగాయి.

కాకినాడ కార్పొరేషన్‌లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ ఎడిషనల్‌ ఎస్పీ రవికుమార్‌ ఇతర అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. టౌన్‌ప్లానింగ్‌ రికార్డుల్లో అవకతవకలు జరిగినట్టు ఫిర్యాదులు అందడంతో తనిఖీలు చేశారు.

ఒంగోలు మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఓ ప్రైవేటు వ్యక్తి. బిల్డింగ్‌ ప్లాన్‌ పనులు చేస్తునట్టు గుర్తించారు. అతడి దగ్గర నుంచి ఐదు వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారన్న సమాచారంతో కార్పొరేషన్‌లోని ఇతర విభాగాలకు చెందిన ఉద్యోగులు.. తమకు వేరే పనులు ఉన్నాయంటూ కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోయారు.

గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సిటీ ప్లానింగ్‌ సెక్షన్‌లోని ఔట్‌ సోర్స్‌ ఉద్యోగి దగ్గర 55 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.

నెల్లూరులోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో ఉదయం నుంచి ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగాయి. పలు డిపార్టుమెంట్లలో డాక్యుమెంట్లను పరిశీలించిన అధికారులు.. భారీగా అవకతవకలు గుర్తించినట్టు తెలుస్తోంది.

కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్‌ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. కడప ఏసీబీ డీఎస్పీ జనార్థన్‌నాయుడు ఆధ్వర్యంలో దాడులు కొనసాగాయి. టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలోని రికార్డులను పరిశీలించి.. పలు అక్రమాలు జరిగినట్టు ఇప్పటికే గుర్తించారు.

తిరుపతి మున్సిపల్‌ కార్యాలయంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. టౌన్ ప్లానింగ్‌ విభాగంలో పలు రికార్డులను పరిశీలించి అధికారులు షాక్‌కు గురైనట్టు తెలుస్తోంది. భవన నిర్మాణానికి అనుమతులు ఇచ్చేందుకు పెద్ద ఎత్తున నగర పాలక సంస్థలోని టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు అవినీతికి పాల్పడ్డారని ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.

Tags

Next Story