బాధిత కుటుంబాలకు కోటి రూపాయల ఆర్థికసాయం ప్రకటించిన 'భారతీయుడు'

బాధిత కుటుంబాలకు కోటి రూపాయల ఆర్థికసాయం ప్రకటించిన భారతీయుడు

బ్లాక్ బ్లస్టర్ మూవీ భారతీయుడుకి సీక్వల్ గా తెరకెక్కుతున్న మూవీ భారతీయుడు- 2. కమల్‌ హాసన్‌ హీరోగా.. దర్శకుడు శంకర్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. అన్ని అవాంతరాలు దాటుకొని రెగ్యూలర్ షూటింగ్ జరుపున్న ఈ మూవీ దాదాపు ఎండింగ్ స్టేజిలో ఉంది. ఈ సమయంలో అనూహ్య ఘటన ఇండస్ట్రిని షాక్ కు గురి చేసింది. ఈవీసీ స్టూడియోలో లైటింగ్ కోసం సెట్ వేసేందుకు ఉపయోగించిన క్రేన్ ఒక్కసారిగా మూవీ యూనిట్ కూర్చున్న టెంట్ మీద పడింది. దీంతో ముగ్గురు మృతి చెందటంతో పాటు 10 మందికి గాయాలయ్యాయి.

మృతుల్లో శంకర్ వ్యక్తిగత సహాయకుడు మధు, అసిస్టెంట్ డైరెక్టర్ సాయికృష్ణ, సహాయకుడు చంద్రన్ ఉన్నారు. గాయపడిన వారిని వెంటనే పునమలై ప్రధాన రహదారిలో గల సవిత ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే.. ఈ ప్రమాదం నుంచి డైరెక్టర్ శంకర్, హీరో కమల్ హాసన్, హీరోయిన్ కాజల్ ఆగర్వాల్ తృటిలో తప్పించుకున్నారు. సవిత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన హీరో కమల్ హాసన్ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. అలాగే వారి కుటుంబాలకు కోటి రూపాయల వంతున ఆర్ధిక సాయం ప్రకటించారు. అయితే.. తాను ఇచ్చింది నష్ట పరిహారం కాదని వాళ్ల ప్రాణాలకు లెక్క గట్టలేమని అన్నారు కమల్. ఇండస్ట్రీలో కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్నా.. సినిమా కోసం పని చేసే వారికి మాత్రం రక్షణ కల్పించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారాయన.

ఇక హీరోయిన్ కాజల్ ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆ తర్వాత ఘటనపై ట్విట్టర్ లో ట్వీట్ చేసిన కాజల్.. తమతోపాటు పనిచేసే కృష్ణ, చంద్రన్, మధును కోల్పోవటం బాధగా ఉందని అన్నారు. తన గుండెలోని బాధను బయటపెట్టడానికి మాటలు రావడం లేదన్నారు. మృతిచెందిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు. ఆ తర్వాత మరో ట్వీట్ చేసిన కాజల్.. షూటింగ్ లో జరిగిన క్రేన్ ప్రమాదంతో తానింకా షాక్ లోనే ఉన్నానని అన్నారు. కేవలం కొన్ని క్షణాల వ్యవధిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నానని, ఆ ఒక్కక్షణం.. కాలం, జీవిత విలువ తెలిసిందని అన్నారామె.

Tags

Next Story