మాజీ ఎంపీ కవితకు ఎమ్మెల్సీ ఇవ్వాలంటూ టీఆర్ఎస్ పార్టీలో డిమాండ్

మాజీ ఎంపీ కవితకు ఎమ్మెల్సీ ఇవ్వాలంటూ టీఆర్ఎస్ పార్టీలో డిమాండ్

ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు రానే వచ్చాయి. తెలంగాణలోని రెండు స్థానాల్లో ఈసారి మాజీ ఎంపీ కవితకు ఒక సీట్ ఇస్తారని టీఆర్ఎస్ వర్గాలు ధీమాగా చెబుతున్నాయి. కవిత మరోసారి పార్లమెంటుకు వెళ్లేందుకు అవకాశంగా దీన్ని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. ఒకవేళ పార్లమెంటుకు వెళ్లే ఆలోచన లేకపోతే.. రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండాల్సి ఉంటుంది. అప్పుడు ఎమ్మెల్సీగా అయినా ఎన్నికవ్వాలి. దీంతో రాజ్యసభ టికెట్.. లేకుంటే ఎమ్మెల్సీ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖాయమనే టీఆర్ఎస్ నేతలంటున్నారు. మార్చి నెలలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. నిజామాబాద్ స్థానిక సంస్థల పరిధిలోని ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికల కోసం త్వరలో నోటిఫికేషన్ వెలువడనుంది. ఇంకా రెండేళ్లపాటు నిజామాబాద్ ఎమ్మెల్సీ పదవీ కాలం ఉండనుంది. దీంతో అది కవితకే ఇవ్వాలంటూ జిల్లాలోని టీఆర్ఎస్ నేతలు అధిష్టానం ముందు డిమాండ్ పెట్టినట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్సీగా కవిత ఎన్నికయితే రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి క్రియాశీలకం అయ్యే అవకాశముందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే కేసీఆర్ తన కుటుంబానికే అన్ని పదవులు కట్టబెడుతున్నారని విపక్షాలు విమర్శలు చేసే అవకాశముంది. దీంతో పరోక్ష పద్ధతుల్లో గెలిచినా అది పెద్దగా ఉపయోగం ఉండదని.. ప్రజాక్షేత్రం నుంచి బరిలో దిగి గెలిస్తే అప్పుడు తన సత్తా నిరూపించుకునేందుకు అవకాశం ఉంటుందని కవిత సన్నిహిత వర్గాలు అంటున్నట్లు సమాచారం. ఈసారి ఎన్నికల్లో దిగి పార్లమెంట్ మెంబర్ గానో, ఎమ్మెల్యేగానో మళ్లీ గెలవాలనే పట్టుదలతో కవిత ఉన్నట్లు కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇటు పెద్దల సభకు అవకాశం మిస్ అయితే ఇక మూడేళ్ల వరకు పదవులు ఏవీ దక్కే చాన్స్ ఉండదు. ఎమ్మెల్సీగా అవకాశం లేకున్నా.. అదే పరిస్థితి. మరి సీఎం కేసీఆర్ తన కుమార్తెను పెద్దల సభకు పంపుతారా..? లేక ఎమ్మెల్సీగా అవకాశమిస్తారా..? అనే చర్చ జోరుగా సాగుతోంది. ఎటూ కాని పక్షంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు ఆగాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తంగా కవిత రాజకీయ భవిష్యత్ ఏంటో త్వరలోనే తెలిసే అవకాశముంది.

Tags

Read MoreRead Less
Next Story