కోవిడ్-19ను ఎదుర్కోవడానికి 100 కోట్లు కేటాయించిన తెలంగాణ ప్రభుత్వం

కోవిడ్-19ను ఎదుర్కోవడానికి 100 కోట్లు కేటాయించిన తెలంగాణ ప్రభుత్వం
X

హైదరాబాద్ లో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో.. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు 100 కోట్లు కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా 3 వేల ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కరోనా వైరస్‌ నియంత్రణ, తీసుకోవాల్సిన చర్యలపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశల మేరకు.. తెలంగాణ నుంచి ఇద్దరు కోఆర్డినేటర్లను కేరళకు పంపాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. ఇటీవల కేరళలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పకడ్బందీ చర్యల కారణంగా బాధితులు పూర్తిగా కోలుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ చేపట్టిన చర్యలపై అధ్యయనం చేసేందుకు.. ఇద్దరు కోఆర్డినేటర్లను కేరళకు పంపించాలని నిర్ణయించారు.

ఇక, వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలు, వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలు, అనుమానితులకు పరీక్షలు, ముందు జాగ్రత్త చర్యలు, ప్రజల్లో అవగాహన కల్పించడం సహా పలు అంశాలపై సమావేశంలో చర్చించారు. కరోనా వైరస్‌పై ఎవరైనా దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యాధి లక్షణాలున్నవారి కోసం హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేయాలని మంత్రులు సూచించారు. 24 గంటలూ అందుబాటులో ఉండే కాల్‌సెంటర్‌తోపాటు ప్రస్తుత కాల్‌సెంటర్ సామర్ధ్యాన్ని పెంచాలన్నారు.

గతంలో వచ్చిన వైరస్‌లతో పోల్చితే.. కరోనా వైరస్‌ల మరణాల రేటు అతి తక్కువగా ఉందన్నారు మంత్రి ఈటల. కరోనా చికిత్సకు గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. కరోనా కోసం ప్రత్యేక ఆసుపత్రి ఏర్పాటుకు శాఖాపరంగా నిర్ణయం తీసుకున్నామని ఈటల తెలిపారు. 9 శాఖల సమన్వయంతో పనిచేస్తామన్నారు. ప్రతి శాఖకు ఓ నోడల్‌ అధికారి ఉంటారని చెప్పారు. ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు, నర్సులను మరింతమందిని నియమిస్తామన్నారు మంత్రి ఈటల. ప్రైవేటు ఆసుపత్రులను కూడా అప్రమత్తం చేస్తూ.. కరోనా అనుమానం ఉన్న రోగులను చికిత్స కోసం గాంధీకి పంపాలని సూచించారు.

ఇదిలావుంటే, కరోనా వైరస్‌ను నిలువరించేందుకు కేంద్రం హోమియోపతి మెడిసిన్‌ అందుబాటులోకి తెచ్చింది. ఆయుష్‌ మంత్రిత్వ శాఖ ద్వారా ఈ మందులను పంపిణీ చేస్తోంది. తెలంగాణలోనే హోమియో మందులను పంపిణీ చేస్తున్నారు.

ఇక, సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో కరోనా బాధితుడికి ట్రీట్‌మెంట్‌ కొనసాగుతోంది. ప్రత్యేక వార్డులో ఉంచి బాధితుడిని పర్యవేక్షిస్తున్నారు. కరోనా బాధితుడి ద్వారా మరెవరికైనా వ్యాధి సోకి ఉంటుందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కరోనా బాధితుడు దుబాయ్ నుంచి మొదట బెంగళూరుకు వచ్చి.. అక్కడి నుంచి బస్సులో హైదరాబాద్ చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో అతను ఎవరెవరితో కలిశాడు వంటి వివరాలు సేకరిస్తున్నారు.

తోటి ప్రయాణికుల ఇళ్లకు వెళ్లి అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రయాణికులతోపాటు.. అతడి బంధువులు మొత్తం 80 మంది ఆరోగ్య పరిస్థితి సమీక్షిస్తున్నారు. వీళ్లందరితోపాటు.. అపోలో ఆసుపత్రిలో బాధితుడికి చికిత్స చేసిన వైద్యుల పరిస్థితిపైనా ఆరా తీస్తున్నారు.

వీరిలో 17 మంది ఏపీ ప్రయాణికులు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంపై ఏపీ ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ల నాని స్పందించారు. ఆ వ్యక్తితో కలిసి ప్రయాణించిన వారి సమాచారం తెప్పించుకుంటున్నామని వెల్లడించారు. ఆ 17 మందిని గుర్తిస్తే వారికి వెంటనే స్క్రీనింగ్ టెస్టులు చేయించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు.

ఇదిలావుంటే, గాంధీ ఆసుపత్రిలో మరో ముగ్గురు కరోనా అనుమానితులు చేరారు. వైద్య సిబ్బంది ప్రత్యేక ఆంబులెన్స్‌లో అనుమానితులను గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ ముగ్గురికి వివిధ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాటి ఫలితాలు వచ్చాకే.. కరోనా సోకిందా లేదా అన్నదానిపై స్పష్టత వస్తుందని డాక్టర్లు తెలిపారు.

మరోవైపు, కరోనా వైరస్ లక్షణాలతో తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న తైవాన్ వాసిని డిఛార్జ్ చేయనున్నారు వైద్యులు. తైవాన్ నుంచి వచ్చిన చన్ చున్ హంగ్ కు కరోనా వైరస్ సోకలేదని, గాంధీ ఆస్పత్రి వైద్యులు సైతం నిర్ధారించారు.

Tags

Next Story