బీసీ రిజర్వేషన్లు విషయంలో సుప్రీం కోర్టును ఆశ్రయించిన టీడీపీ

బీసీ రిజర్వేషన్లు విషయంలో సుప్రీం కోర్టును ఆశ్రయించిన టీడీపీ

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల తగ్గింపును సవాల్‌ చేస్తూ.. టీడీపీ నేతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఎంపీ రామ్మోహన్‌నాయుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీలు కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్పలు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బీసీ రిజర్వేషన్ల కుదింపు నిర్ణయం సీఎం జగన్ కనుసన్నల్లో జరిగిందని ఎంపీ రామ్మోహన్‌ నాయుడు ఆరోపించారు. సొంత కేసులకు కోట్ల రూపాయలు ఖర్చు చేసి లాయర్లను పెట్టుకున్న జగన్‌.. బీసీల కేసులో ఎందుకు సమర్ధుడైన లాయర్‌ను నియమించలేదని ప్రశ్నించారు.

ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే తాము సుప్రీం కోర్టులో పిటిషన్ వేయాల్సి వచ్చిందన్నారు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 34 శాతం ఉన్న బీసీల రిజర్వేషన్‌ 24 శాతానికి ఎలా పడిపోతుందన్నారు. బీసీలకు రాజ్యాధికారం దక్కకూడదన్న దురుద్దేశంతోనే ఇలాంటి పరిణామాలు తలెత్తాయన్నారు కొనకళ్ల.

బలహీనవర్గాలకు జగన్‌ తీరని అన్యాయం చేస్తున్నారని.. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జగన్‌ బీసీల ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారని కొల్లు రవీంద్ర విమర్శించారు. కోర్టుల ద్వారా రిజర్వేషన్ల అమలుకు ఎదురవుతున్న ఇబ్బందులను ప్రభుత్వం ముందే ఎందుకు గ్రహించి స్పందించలేదని ఆయన ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story