హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. వందలాది వాహనాలు బుగ్గిపాలు

హైదరాబాద్ లోని గోషామహాల్ స్టేడియంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వివిధ కేసుల్లో రికవరీ చేసిన వాహనాలు బుగ్గుపాలయ్యాయి. కాలాపత్తర్ పోలీస్టేషన్ పరిధిలో ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ కేసుల్లో రికవరీ చేసిన వందలాది వాహనాలను గోషామహాల్ స్టేడియంలో నిలిపి ఉంచారు. వాహనాలకు కాపలాగా ఉన్న కాలిస్టేబుల్ ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు గంటలు శ్రమించి మంటలను అదుపుచేశారు. మిగిలిన వాహనాలకు మంటలు వ్యాపించకుండా అదుపుచేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు.
కాలాపత్తర్ పోలీస్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను నిలిపేందుకు స్థలం లేకపోవడంతో గోషా మహాల్ స్టేడియంలో వాహనాలను భద్రపరుస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, యాక్సిడెంట్, ట్రాఫిక్ చలాన్ల పెండింగ్, వివిధ నేరాల్లో పట్టుబడిన 37 పోలీస్టేషన్లకు చెందిన వాహానాలను ఇక్కడికి తరలిస్తున్నారు. కొన్ని సంవత్సరాల తరబడి వాహనాలు పార్క్ చేసి ఉండటంతో అవి తుప్పు పట్టి ఎందుకు పనికిరాకుండా పోతున్నాయి. గతంలో కూడా ఇక్కడ అగ్నిప్రమాదం జరిగి వందలాది వాహనాలు బుగ్గిపాలయ్యాయి.
వివిధ కేసుల్లో రికవరి అయిన వేలాది వాహనాలతో పాటు, డిపార్ట్ మెంట్ లో పనికిరాకుండా పోయిన వాహనాలను కూడ ఇక్కడే పడేస్తున్నారు. దీంతో గోషామహల్ స్టేడియం ఇప్పుడు తుప్పుపట్టిన వాహనాలతో డంపింగ్ యార్డ్ ను తలపిస్తోంది. తరుచు జరుగుతున్న అగ్నిప్రమాదాలు, వాహనాలు పార్క్ చేసిన స్థలంలో పాములు, దోమలు, క్రిమి కీటకాలు చేరుతుండడంతో చుట్టుపక్కల కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఇక్కడి నుండి ఈ వాహనాలను తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

