ఏపీలో వేడెక్కిన స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం

ఏపీలో వేడెక్కిన స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం

ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. 660 జడ్పీటీసీ, 9,984 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం బుధవారం వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ మేరకు జిల్లాల వారీగా నామినేషన్ల దాఖలుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఎంపీటీసీ స్థానాలకు సంబంధిత మండల పరిషత్‌ కార్యాలయంలో.. జెడ్పీటీసీ స్థానాలకు జిల్లా పరిషత్‌ సీఈఓ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఈ నెల 21న పోలింగ్, 24న కౌంటింగ్‌ జరగనుంది

పరిషత్‌ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ షురూ కావడంతో.. ప్రధాన పార్టీలు అభ్యర్ధుల వేటలో పడ్డాయి. వివిధ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని గెలుపు గుర్రాలను బరిలోకి దించుతున్నాయి. గెలుపే లక్ష్యంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తున్నారు. మరోవైపు టిక్కెట్‌ ఆశించే ఆశావహులు భారీగా లాబియింగ్‌లు మొదలుపెట్టారు. నేతలను ప్రసన్నం చేసుకుంటూ.. టిక్కెట్ కోసం పాట్లు పడుతున్నారు.

నామినేషన్ల ఘట్టంతో జిల్లా, మండల కార్యాలయాల్లో సందడి వాతావరణం నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరుగురు జడ్పీటీసీ అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే ఎంపీటీసీ స్థానాలకు.. 48మండలాల్లో 71 మంది ఎంపీటీసీ అభ్యర్ధులు.. నేమినేషన్‌ పత్రాలు సమర్పించారు. ఇక చిత్తూరు జిల్లాలో జడ్పీటీసీ స్థానాలకు 22మంది నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే కడప జిల్లా రైల్వే కోడూరులో.. తొలి రోజు 7ఎంపీటీసీ అభ్యర్ధులు నామపత్రాలు సమర్పించారు.

చిత్తూరు జిల్లాలో వైసీపీ నాయకులు, కార్యకర్తల అరాచకం సృష్టించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాఖాలో ఆయన అనుచరులు రెచ్చిపోయారు. పుంగనూరు నియోజకవర్గం సదుంలో ఎంపీటీసీ పదవికి నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన టీడీపీ అభ్యర్థులపై బూతుపురాణం మొదలుపెట్టారు. నామినేషన్ల కేంద్రం నుంచి బలవంతంగా అభ్యర్థులను బయటకు పంపేశారు. మంత్రి అనుచరులు రెచ్చిపోతున్నా.. పోలీసులు ఏ మాత్రం పట్టించుకోకుండా చోద్యం చూశారు. వైసీపీ కార్యకర్తల దౌర్జన్యంతో... ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు.

గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. అక్కడ MPP స్థానాన్ని బీసీకి కేటాయించారు. 17 MPTC స్థానాలకు గాను.. ఎస్సీలకు 5, ఎస్టీలకు 3 స్థానాలు కేటాయించి.. మిగిలిన 9 జనరల్‌కు కేటాయించారు. అంటే మొత్తంలో బీసీలకు ఒక్క MPTC కూడా ఇవ్వలేదు. MPTC స్థానం లేకుండా BCకి MPP పదవి కేటాయించడంపై విమర్శలు వెల్లివెత్తుతున్నాయి.

మరో రెండు రోజుల సమయం ఉండడంతో.. నామినేషన్ల భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్‌ అంశం లోపభూయిష్టంగా మారింది. రిజర్వేషన్లు శాస్త్రీయంగా జరక్కపోవడంతో అభ్యర్థులు, ప్రజల్లో గందరగోళం నెలకొంది.

Tags

Read MoreRead Less
Next Story