విశాఖ వైసీపీలో మొదలైన టికెట్ల లొల్లి.. ఓటమి ఖాయమంటున్న ఆశావహులు
విశాఖ వైసీపీలో కార్పొరేషన్ టికెట్ల లొల్లి మొదలైంది. పార్టీని నమ్ముకున్నవారికి టికెట్లు ఇవ్వలేదంటూ కొందరు ఆందోళన చేస్తున్నారు. నేతల కుటుంబ సభ్యులకే టికెట్లు ఇచ్చుకున్నారని ఆగ్రహంతో పార్టీ ఆఫీస్ వద్ద ధర్నాలకు దిగారు. నమ్మించి మోసం చేశారంటూ లీడర్ల తీరుపై మండిపడ్డారు. ఇలాగైతే వైసీపీ ఓడిపోవడం ఖాయమంటూ తీవ్ర విమర్శలు చేశారు.
విశాఖ వైసీపీ ఆఫీస్ ముందు వివిధ డివిజన్ల ఆశావహుల ధర్నాలు, ఆందోళనలు పెద్ద ఎత్తునే జరిగాయి. పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా క్యాడర్ నినాదాలు చేయడం కలకలం రేపింది. విశాఖ కార్పొరేషన్ ఎన్నికలకు తొలి విడతలో 48 మందితో.. గురువారం అభ్యర్థుల పేర్లను మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రకటించారు. ఆ వెంటనే అసంతృప్తి జ్వాలలు మొదలయ్యాయి. భవిష్యత్‌పై ఆందోళన వద్దని టికెట్లు దక్కని నేతల్ని బుజ్జగించే ప్రయత్నం చేసినా.. నిరసనలు కొనసాగాయి. 3 ఏజెన్సీల ద్వారా సర్వేలు చేపట్టి అభ్యర్థుల్ని ఖరారు చేశామన్న మంత్రి అవంతి.. కార్పొరేషన్ ఎన్నికల్లో విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ఐతే.. కింది స్థాయిలో ప్రతి డివిజన్‌లోనూ తీవ్రమైన అసంతృప్తి ఉండడం కలవరపరుస్తున్నా పైకి మాత్రం అంతా భేష్ అంటూ కలర్ ఇస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com