కరోనా కట్టడికి కేసీఆర్ కీలక నిర్ణయం.. హైదరాబాద్‌లో షట్ డౌన్?

కరోనా కట్టడికి కేసీఆర్ కీలక నిర్ణయం.. హైదరాబాద్‌లో షట్ డౌన్?

కరోనా వైరస్‌ కట్టడికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది. అనుమానిత కేసు కలకలం రేపిన రోజు నుంచే అప్రమత్తమైన ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. కరోనా వైరస్‌ కలకలం నేపథ్యంలో అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ ప్రకటన చేశారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై ఇప్పటికే హైలెవల్‌ కమిటీ సమీక్షిస్తోందని.. సాయంత్రం కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్‌ చెప్పారు.

తెలంగాణలో పరిస్థితి ఆందోళనకరంగా లేకపోయినప్పటికీ.. ప్రజల్లో భయాందోళనలు పోగొట్టడం కోసమే సీఎం కేసీఆర్‌ ప్రకటన చేసినట్లుగా అర్థమవుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు వైరస్‌ బారిన పడి ఇద్దరు మాత్రమే చనిపోయారు. 60 మందికిపైగా వైరస్‌ లక్షణాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం లేదు. దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి వైరస్‌ సోకగా.. గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందించారు. క్యూర్‌ కావడంతో అతన్ని డిశ్చార్జ్‌ చేసి పంపించారు. మరో పాజిటివ్‌ కేసు నమోదు కాగా.. ఇద్దరికి లక్షణాలు కనిపించాయి. వారి బ్లడ్‌ శాంపిల్స్‌ కూడా పుణె ల్యాబ్‌కు పంపించారు.

అటు ప్రజలను కాపాడుకోవడానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో వెల్లడించారు. ప్రజలెవరూ భయపడాల్సిన పనిలేదన్నారు. వ్యాధి బారిన పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్‌ సమావేశం తర్వాత ప్రభుత్వం ప్రకటన చేస్తుందని చెప్పారు. అటు కర్నాటకలో షట్‌ డౌన్‌ అంశాన్ని కూడా సభలో ప్రస్తావించారు సీఎం కేసీఆర్‌. హైదరాబాద్‌లో తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిపెట్టామన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో కూడా షట్‌డౌన్‌ విధించే అంశంపై సాయంత్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

Tags

Read MoreRead Less
Next Story