చాపకింద నీరులా కరోనా.. తెలుగు రాష్ట్రాల్లో అప్రమత్తమైన అధికారయంత్రాంగం

చాపకింద నీరులా కరోనా.. తెలుగు రాష్ట్రాల్లో అప్రమత్తమైన అధికారయంత్రాంగం

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ తెలుగు రాష్ట్రాల్లోనూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. దీంతో అన్ని జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అధికారులు, పోలీసులు, ప్రజాప్రతినిధులతో కలెక్టర్ ప్రశాంత్ జె. పాటిల్, ఎస్పీ పీవీ రంగనాథ్‌ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

శంషాబాద్‌ ఎయిర్ పోర్టు స్క్రీనింగ్‌ లో గుర్తించిన జిల్లావాసులు 51 మందిపై అనుమానిత కేసులు నమోదు చేశారు. వీరంతా ఇటీవలే విదేశాల నుంచి వచ్చారు. వీరందరి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు, రెవెన్యూ అధికారులు, పోలీసుల అధికారుల బృందం పరిశీలిస్తోంది. విదేశాల నుంచి వచ్చిన వారిని నిరంతరం మానిటరింగ్ చేస్తున్నామని కలెక్టర్ ప్రశాంత్ తెలిపారు.

ఇక, భారత్‌ లో కరోనా వైరస్‌ సెకండ్‌ స్టేజ్ లో వుందన్నారు జిల్లా ఎస్పీ రంగనాథ్. థర్డ్ స్టేజ్ కు వెళ్లకుండా కట్టడి చేయాల్సిన అవసరం వుందన్నారు. ఈ క్రమంలో చైనా, అమెరికా, హాంకాంగ్, రోమ్, సౌదీ సహా ఇతర దేశాల నుంచి వస్తున్నవారిని క్షుణ్ణంగా పరిశీలించాల్సి వుందన్నారు. సోషల్‌ మీడియాలో తప్పుడు సమాచారం ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

కరోనాపై అటు రాష్ట్రంలోని జిల్లా కోర్టులు అప్రమత్తమయ్యాయి. పలు అనుమానిత కేసులు నమోదైన నేపథ్యంలో.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు.. ఆదిలాబాద్‌ జిల్లా కోర్టు ఆధ్వర్యంలో ముదస్తు చర్యలు చేపట్టారు. మూడు వారాలా వరకు సాధారణ కేసులు వాయిదా వేశారు. అత్యవసర కేసులను మాత్రమే విచారణకు స్వీకరిస్తామని జిల్లా జడ్జి ప్రియదర్శిని తెలిపారు. మూడువారాల పాటు న్యాయవాదులు, కక్షిదారులు కోర్టు హాజరు కావాల్సిన అవసరం లేదన్నారు. ఖైదీలను నేరుగా కాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారిస్తామని తెలిపారు. అటు కోర్టు ఆవరణలో శానిటైజర్లు, మాస్కులు అందుబాటులో ఉంచారు. కరోనా వైరస్ వ్యాప్తిచెందకుండా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు.

కరోనా వ్యాప్తిపై అటు ఏపీలోనూ అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తమయ్యారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ అలర్టయింది. అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప.. జిల్లాల నుంచి కార్యకర్తలు, నాయకులు రావొద్దని పార్టీ పిలుపునిచ్చింది. పార్టీ కార్యాలయానికి వస్తున్న అధినేత చంద్రబాబు సహా అందరికీ థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. 100 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతై పార్టీ కార్యాలయంలోకి అనుమతించకూడదని నిర్ణయించారు. కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చంద్రబాబు సిబ్బందికి వివరించారు.

కర్నూలు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో కరోనా కలకలం రేగింది. ఓ హెడ్ కానిస్టేబుల్ కుమారుడు ఇటీవలే విదేశాల నుంచి వచ్చాడు. కరోనా అనుమానిత లక్షణాలు బయటపడటంతో అతన్ని అసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో డీజీఓలో శుభ్రతా చర్యలకు జిల్లా ఎస్పీ ఫకీరప్ప ఆదేశాలు జారీచేశారు.

కరోనాపై కాకినాడలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే సినిమాహాళ్లు, స్కూళ్లు మూసివేశారు. ఇందులో భాగంగా కాకినాడ బస్టాండ్‌ లో దూరప్రాంతాల నుండి వచ్చిన బస్సులు, నగరంలో పలు సినిమా హాల్స్ లో సోడియం స్ప్రే, బ్లీచింగ్ పౌడర్‌ ను చల్లుతున్నారు. అంతేకాకుండా దూరప్రాంతాల నుంచి వచ్చే బస్సుల్లో సీట్ కవర్లు మారుస్తున్నారు.

Tags

Next Story