అమెరికాను కమ్మేస్తున్న కరోనా

అమెరికాను కమ్మేస్తున్న కరోనా

కరోనా వైరస్.. దీనిపేరు వింటేనే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. రోజు రోజుకు వైరస్ ఉగ్రరూపం దాల్చడంతో అన్నిదేశాలు ముందుజాగ్రత్త చర్యలకు దిగాయి. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు అమెరికా దేశవ్యాప్తంగా తీవ్ర ఆంక్షలు విధించి అమలు చేస్తోంది. జనసమ్మర్ధ ప్రాంతాలైన విద్యాలయాలు, కళాశాలు, సినిమా హాల్స్, షాపింగ్స్ మాల్స్, వ్యాపార సముదాయాలు, రెస్టారెంట్లు, బార్లను మూసివేసింది. వీటితోపాటు రానున్న8 వారాలపాటు 50మంది కంటే ఎక్కువ మంది గుమికూడే కార్యక్రమాలను చేపట్టకూడదని స్పష్టం చేసింది. కొవిడ్ -19 ను ఎదుర్కొనేందుకు రానున్న 8వారాల వరకు కాన్ఫరెన్స్ లు, సభలు, సమావేశాలు, సదస్సులు, వివాహాలు, పండుగ వేడుకలు నిర్వహించకూడదని సూచించింది. ఇప్పటికే చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం ఆప్షన్ ఇవ్వడంతో.. అమెరికాలో సాధారణ జన జీవనం స్థంభించింది.

అమెరికాలో వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య 68 కిచేరగా.. కరోనా బారిన పడిన వారి సంఖ్య 3689కి చేరుకుంది. దీంతో అగ్రదేశం మరింత కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే ఐరోపా దేశాల ప్రయాణీకులపై నిషేధం విధించిన యూఎస్ ఇప్పుడు బ్రిటన్, ఐర్లాండ్ ల ప్రయాణీకులను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక యుద్ద నౌకలో ఉన్న ఓ సైనికుడికి సైతం వైరస్ సోకినట్లు తేలడంతో అధికారులు తీవ్ర ఆందోళకు గురయ్యారు. ఆర్మీలో వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు చర్యలుచేపట్టారు. ఇక విమనాశ్రయాల్లో స్క్రీనింగ్ టెస్టులు చేస్తుండటంతో ఒక్క చికాగో విమానాశ్రయంలో 5గంటల సమయం పడుతోంది. దీంతో ప్రయాణీకులు గంటల తరబడి విమానాశ్రయాల్లోనే ఉండాల్సి వస్తోంది.

కరోనా వైరస్ అమెరికాలో చాలా వేగంగా వ్యాపిస్తోంది. రెండు మూడు రోజులక్రితం 10 రాష్ట్రాల్లోనే ఉన్న దీని ప్రభావం ఇప్పుడు దేశంలోని 49 రాష్ట్రాలకు పాకింది. అమెరికాలోని ఉన్న వాతావరణం వైరస్ వ్యాప్తికి అనుకూలంగా ఉన్నట్లు అక్కడి వైద్యులు అంటున్నారు. దీన్ని కట్టడి చేయాలంటే కొద్దిరోజులు అమెరికా జీవన విధానానికి భిన్నంగా జీవించాల్సి ఉంటుందని నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ అలర్జీ, ఇన్ఫెక్షన్ డిసీజ్ డైరెక్టర్ అంతోని అన్నారు. వ్యాధి నిరోధించేందుకు ప్రభుత్వం ఆంక్షలను పాటించాలన్నారు. వైరస్ ప్రభావం అధికంగా ఉన్న కాలిఫోర్నియా, న్యూయార్క్, వాషింగ్టన్ డీసిలో జనం పూర్తిగా ఇళ్లకే పరిమితం అయ్యారు.

కొవిడ్- 19 ప్రభావంతో దేశంలోని అన్ని రాష్ట్రాలు హెల్త్ ఎమర్జెన్సీని అమలుచేస్తున్నాయి. దీనికారణంగా అక్కడ విద్య, వ్యాపార సముదాయాలు పూర్తిగా మూతపడ్డాయి. న్యూయార్క్ లో అయితే ఎప్రిల్ 20వరకు స్కూల్స్ మూసివేస్తున్నట్లు మేయర్ పేర్కొన్నారు. ఎడ్యుకేషనల్ వెబ్ సైట్ ద్వారా విద్యాబోధన సంబంధించిన అంశాలను ఉపాధ్యాయులు విద్యార్ధులకు అందించాలని సూచించారు. రిమోట్ లెర్నింగ్ క్లాసులు ఈనెల 23 నుంచి అమలు చేస్తున్నట్లు తెలిపారు. దీని ప్రభావం అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయులపై కూడా తీవ్రంగాపడింది. అన్నిరకాల పర్యటలను రద్దుచేసుకొని ఇంటికే పరిమితమయ్యారు. ఇక తెలుగు సంఘాలు ప్రతి రెండేళ్లకు ఒకసారి ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహాసభలను వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ అమెరికా తెలుగు సంఘం టాటా తెలిపింది. అదేవిధంగా తమ కన్వెన్షన్ పోస్టుపోన్ చేస్తున్నట్లు ఆటాతెలిపింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కరోనా బాధితులను కలుసుకున్నారన్న వార్తల నేపధ్యంలో ఆయనకు వైరస్ టెస్టులు చేసినట్లు అధ్యక్ష భవనం వైట్ హౌజ్ పేర్కొంది. అధ్యక్షుడు ట్రంప్ కు టెస్టుల్లో నెగెటివ్ రిపోర్టు వచ్చిన్నట్లు వైట్ హౌజ్ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీని విధిస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్, ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ తాను కూడా వైరస్ పరీక్షలు చేసుకోవాల్సి వస్తుందేమోనని అన్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రభుత్వ నిబంధనల కారణంగా జనం నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం ఎగబడుతున్నారు. న్యూయార్క్, న్యూజెర్సీ, వర్జీనియాలతో పాటు పలు నగరాల్లో షాపుల వద్ద జనం బారులు తీరి కనిపిస్తున్నారు. పెద్ద మొత్తంలో జనం కొనుగోలు చేయడంతో షాపుల్లో సరుకుల కొరత ఏర్పడుతోంది. ఈ పరిస్థితిపై ఏకంగా అమెరికా అధ్యక్షుడు స్పందించారు. నిత్యావసర వస్తువుల కోసం ఎవరు ఆందోళన చెందవద్దని.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సరఫరా వ్యవస్థ అమెరికా సొంతమని స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story