కరోనా పుంజుకోవటంతో.. అలర్ట్ అయిన తెలుగు రాష్ట్రాలు

కరోనా పుంజుకోవటంతో.. అలర్ట్ అయిన తెలుగు రాష్ట్రాలు

హైదరాబాద్ లో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. స్కాట్లాండ్ నుంచి వచ్చిన వ్యక్తికి కోరనా పాజిటివ్ రావటంతో అతని బ్లడ్ శ్యాంపిల్స్ మరోసారి పూణేలోని వైరాలజీ ల్యాబ్ కు పంపించారు. ప్రస్తుతం అతన్ని గాంధీ ఆసుపత్రిలోని ఐసొలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. దీంతో ఇప్పటివరకు 3 పాజిటివ్ కేసులు హైదరాబాద్ లో నమోదయ్యాయి.

ఇక, కరోనా వేగం పుంజుకుంటున్న నేపథ్యంలో.. విదేశాల నుండి హైదరాబాద్ కు వచ్చే ప్రయాణీకులపై ప్రభుత్వం దృష్టిసారించింది. శంషాబాద్ విమానాశ్రయంలో నివారణ చర్యలను మరింత ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ కమీషనర్ సజ్జనార్ శంషాబాద్ విమానాశ్రయం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇప్పటికే ఒకసారి ఎయిర్ పోర్ట్ ను సందర్శించిన ఆయన.. మరోసారి శంషాబాద్ విమానాశ్రయాన్ని సందర్శించారు. ఎయిర్ పోర్ట్ మొత్తం కలియతిరుగుతూ పరిస్థితిని సమీక్షించారు.

అదేవిధంగా థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ కోసం వైద్యులు తీసుకుంటున్న జాగ్రత్తలతో పాటు ఏర్పాట్లను కమీషనర్ దగ్గరుండి పరిశీలించారు. సజ్జనార్ తో పాటు గాంధీ ఆసుపత్రి నుండి వచ్చిన వైద్య నిపుణుల బృందం కూడా ఎయిర్ పోర్ట్ లోని థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ సెంటర్ లో పరిస్థితిని సమీక్షించారు. అంతర్జాతీయ ప్రయాణీకుల్లో ఎవరికైనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే వారిని వెంటనే హైసోలేషన్ వార్డులకు తరలించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. కరోనా వైరస్ పట్ల ప్రయాణీకులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సైబరాబాద్ కమీషనర్ సజ్జనార్ భరోసా ఇచ్చారు.

ఇక, కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గచ్చిబౌలి స్టేడియంను 300 పడకల కరోనా క్వారంటైన్ కేంద్రంగా మార్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అథ్లెటిక్ క్రీడా ప్రాంగణంలో ఉన్న పరిపాలన విభాగంతో పాటు అందుబాటులో ఉన్న గదులను అధీనంలోకి తీసుకుని వైరస్ నివారణ వార్డుల కింద తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

ఇకపై కరోనా వ్యాధి ఉన్నా, లక్షణాలు ఉన్నా వాళ్లను వెంటనే గచ్చిబౌలి స్టేడియంకి తీసుకొస్తారు. అక్కడ ప్రతి ఒక్కర్నీ ప్రత్యేక గదిలో ఉంచుతారు. ఈ క్రమంలో గచ్చిబౌలి స్టేడియంను ప్రతీ రెండు గంటలకు ఓసారి పూర్తిగా క్లీన్ చేస్తారు. స్టేడియం చుట్టూ ప్రతీ 2 గంటలకు ఓసారి బ్లీచింగ్ చల్లేస్తారు. అలాగే కరోనా లక్షణాలు ఉన్నవారిని నిరంతరం ఇక్కడే పర్యవేక్షిస్తారు.

అటు కరోనా వైరస్ ఏపీని కూడా వణికిస్తోంది. ఇప్పటివరకు ఏపీలో ఒక పాజిటివ్ కేసు నమోదు కాగా.. తాజాగా కరోనా లక్షణాలతో ఓ మహిళ మృతిచెందింది. పశ్చిమ గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెం గ్రామానికి చెందిన ఓ మహిళ ఇటీవలే దుబాయ్ నుంచి వచ్చింది. ఆమె కరోనా లక్షణాలతో బాధపడుతుండటంతో.. కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అయితే, చికిత్స పొందుతూ సోమవారం ఆమె మృతిచెందింది. అయితే, ఇది కరోనా మరణం కాకపోవచ్చని.. మెదడువాపు వ్యాధితో మరణించి వుండవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.

కరోనా వ్యాప్తి పట్ల పశ్చిమ గోదావరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ విభాగం అప్రమత్తమైంది. ప్రజలకు కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన ర్యాలీలు నిర్వహిస్తోంది. చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, పరిశుభ్రమైన బట్టలు ధరించాలని, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని పలు సూచలను చేశారు అధికారులు

ఇక, కరోనా పేరు చెబితేనే విశాఖ వాసులు వణికిపోతున్నారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావడం లేదు. దీంతో సాగరతీర నగరంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా దర్శనిమిస్తున్నాయి. మరోవైపు మాస్కులు దొరక్క ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు, కరోనా పట్ల వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story