ఇటలీ కొంపముంచిన నిర్లక్ష్యం.. కమ్మేసిన కరోనా

ఇటలీ కొంపముంచిన నిర్లక్ష్యం.. కమ్మేసిన కరోనా

కరోనా పేరు చెబితేనే ప్రపంచ దేశాలు భయంతో బిక్కచచ్చిపోతున్నాయి. ఆ మహమ్మారి విశ్వరూపాన్ని తట్టుకోలేక చేతులెత్తేస్తున్నాయి. కరోనా దాటికి అతి ఎక్కువగా ఎఫెక్ట్ అయిన దేశం చైనా. ఎందుకంటే ఈ వైరస్ పురుడుపోసుకుంది అక్కడే. కానీ ఇప్పుడు చైనాను మించిన విలయం ఇటలీలో జరుగుతోంది. ఇటాలియన్లు చేసిన పొరపాట్లే వారి పాలిట శాపంగా మారాయి. కరోనాను లైట్ తీసుకున్నారు. నిర్లక్ష్యం వహించారు. ఇప్పుడా నిర్లక్ష్యమే కోలుకోలేని విధంగా దెబ్బతీస్తోంది. చైనా మెల్లగా కోలుకుంటోంది. కానీ ఇటలీ పరిస్థితి ఊహకు కూడా అందడం లేదు. మరణాల సంఖ్యలో ఇప్పటికే చైనాతో పోటీ పడుతోంది. మరికొన్ని రోజుల్లోనే చైనాను ఓవర్‌ టేక్ చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు నిపుణులు. ఇటలీలో ఎందుకింత అల్లకల్లోలం జరుగుతోంది. వాళ్లు చేసిన తప్పులేంటి?

ఇటలీ జనాన్ని వెంటాడి వేటాడుతోంది కరోనా వైరస్. ఇప్పటివరకు 2,500 మందికిపైగా చనిపోయారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రజల అలసత్వం వెరసి.. జస్ట్​ రెండు వారాల్లోనే ఇటలీ పరిస్థితి భయంకరంగా తయారైంది. స్టేజ్​ 3 నుంచి స్టేజ్​ 6కి రావడానికి జస్ట్​ 5 రోజులే పట్టింది. ప్రస్తుతం ఇటలీకి, ఇతర దేశాలకు మధ్య ఉన్న పెద్ద తేడా అదే. అక్కడ మరణాలు, కేసులు శరవేగంగా పెరిగిపోవడానికి కారణం నిర్లక్ష్యమే. మాకేం అవుతుందిలే అన్న అశ్రద్ధ, అజాగ్రత్తలే ఇప్పుడు ఆ దేశం కొంపముంచాయి.

కరోనా కల్లోలం ముంచుకొస్తోందని ఇటాలియన్లకు తెలుసు. దేశంలో తొలి కేసులు నమోదయ్యాయన్న సంగతీ తెలుసు. కానీ, చాలా మంది జస్ట్​ అదో ఫ్లూ అనుకున్నారు. భయపడాల్సిన అవసరం లేదనుకున్నారు. ఎవరికివారే తమకేమైనా 75 ఏళ్లున్నాయా? మాకేమవుతుంది? మేము సేఫ్ అనుకున్నారు. మాస్కులు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? అంటూ లైట్ తీసుకున్నారు. ఇంతలోనే కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. అయినా ఓ రెండు చిన్న టౌన్లలో మాత్రమే లాక్​డౌన్ ప్రకటించారు.

చూస్తుండగానే జనం పిట్టల్లా రాలిపోయారు. ఒక్కరోజులోనే కేసులు రెట్టింపయ్యాయి. ఎక్కువ కేసులు నమోదైన నాలుగు రీజియన్లను బంద్​చేశారు. రెడ్​జోన్లుగా ప్రకటించారు. క్వారెంటైన్​చేశారు. స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. పావు వంతు దేశం బంద్​ అయింది. రెడ్​జోన్​లో ఉన్న 10 వేల మంది తప్పించుకున్నారు. అయినా అటు ప్రభుత్వం కానీ, ఇటు ప్రజలు కానీ పూర్తిస్థాయిలో సన్నద్ధం కాలేదు. ముంచుకొస్తున్న ఉప్పెనను ఏ మాత్రం అంచనా వేయలేదు.

చూస్తుండాగనే పరిస్థితి చేయిదాటిపోయింది. ప్రభుత్వం హెల్త్‌ఎమర్జెన్సీ ప్రకటించింది. స్కూళ్ల నుంచి మాళ్ల దాకా అన్నీ క్లోజ్ అయ్యాయి. బాధితులతో హాస్పిటళ్లు నిండిపోయాయి. కానీ, పేషెంట్లకు తగ్గట్టు డాక్టర్లు, నర్సులూ లేరు. దీంతో చాలా మందికి సరైన చికిత్స అందలేదు.ః జనం పిట్టలా రాలిపోయారు.

అయితే ఎకానమీ పడిపోవద్దన్న ఉద్దేశంతో కొన్నిషాపులు, బార్లు, రెస్టారెంట్లు, మెడికల్ హాళ్లు, తెరిచే ఉంచింది ఇటలీ ప్రభుత్వం. అదే అదనుగా జనం ఇష్టమొచ్చినట్లు షాపింగ్‌లు చేశారు. బార్లలో తాగితందనాలు ఆడారు. అటు రెడ్‌జోన్‌ నుంచి పారిపోయిన ఆ 10వేల మంది ఇటలీ మొత్తానికి వైరస్ అంటించేశారు. జరగాల్సిన నష్టమంతా జరిగిపోయాక కళ్లు తెరిచింది ఇటలీ ప్రభుత్వం.. దేశం మొత్తాన్ని షట్‌డౌన్ చేసింది. నిత్యావసరాలు దొరికే సూపర్​ మార్కెట్లు, అత్యవసరమైన మందుల షాపులకు మాత్రమే మినహాయింపు ఇచ్చింది. సర్కార్​ ఇచ్చే సర్టిఫికెట్​ ఉంటే తప్ప బయటకు వెళ్లలేని పరిస్థితి. ఎక్కడికక్కడ పోలీస్​ చెక్​ పాయింట్లు ఏర్పాటు చేశారు. సరైన కారణం లేకుండా బయటకు పోతే 206 యూరోల ఫైన్​ విధించారు. కరోనా పేషెంట్​ అని తెలిసినా బయటకు పోతే ఏడాది నుంచి 12 ఏండ్ల జైలు శిక్ష విధించారు. ఈ జాగ్రత్తలేవో ముందే తీసుకుంటే పరిస్థితి ఇంత వరకు వచ్చేదే కాదు. వేలాది మంది ప్రామాలు పోయేవే కాదు.

Tags

Read MoreRead Less
Next Story