కరీంనగర్‌లో కరోనా డేంజర్ బెల్స్

కరీంనగర్‌లో కరోనా డేంజర్ బెల్స్
X

కరీంనగర్‌లో కరోనా వైరస్‌ డేంజర్ బెల్స్‌ మోగిస్తోంది. ఏకంగా 8 మందికి కరోణా లక్షణాలు బయటపడ్డాయి. కరీంనగర్ జిల్లాలో ఏడుగురికి హైదరాబాద్‌లో ఒకరికి వైరస్‌ బయటపడింది. అయితే వీరంతా ఇండోనేషియా వాసులని ప్రభుత్వం ప్రకటించింది. వెంటనే వారిని గాంధీ ఆసుపత్రిలోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో కరీంనగర్ జిల్లాలో అధికారులు అలర్ట్ అయ్యారు. ఎవరూ ఇళ్లలోంచి బయటికి రావద్దని ఆదేశాలు జారీ చేశారు. పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు.

ఇటీవలె ఇండోనేషియా నుంచి 10 మంది వ్యక్తులు మతపరమైన కార్యక్రమాల కోసం కరీంనగర్ వచ్చారు. కరీంనగర్‌, రామగుండంలలో వీరు మత ప్రచారం నిర్వహించారు. సమాచారం అందుకున్న పోలీసులు వీరిని కరీంనగర్‌ ప్రధాన ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. వారిలో కరోనా లక్షణాలు కనిపించడంతో.. వైద్యులు వెంటనే ఇండోనేషియా వాసుల్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీలో జరిగిన టెస్టుల్లో ఏడుగురికి కరోనా ఉన్నట్టు తేలడంతో.. కరీంనగర్‌లో అధికారులు అలర్ట్‌ అయ్యారు.

కరీంనగర్ వచ్చిన ఇండోనేషియా వాసులు.. ఏఏ ప్రాంతాల్లో తిరిగారు. ఎవరెవరిని కలిశారో అధికారులు ఆరా తీస్తున్నారు. వారు సంచరించిన ఏరియాల్లో బుధవారం రాత్రి నుంచి కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా కెమికల్స్‌ చల్లుతున్నారు. యుద్ధ ప్రాతిపదికన కరీంనగర్‌లో వంద మంది డాక్టర్ల బృందం స్థానికులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. అవసరమైతే తప్ప.. ఇళ్లలోంచి ఎవరికీ బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలంతా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచిస్తున్నారు.

Tags

Next Story