ఇండియా మరో ఇటలీ అవ్వాలి అనుకుంటున్నారా?
భారత్‌లో కరోనా కట్టడి కోసం మహోగ్ర యుద్ధం జరుగుతోంది. మోదీ సర్కార్‌తో పాటు.. కేసీఆర్, జగన్ ప్రభుత్వాలు వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు అత్యున్నత చర్యలు తీసుకుంటున్నాయి. ప్రతి సందర్భంలోనూ స్పందిస్తూ.. నిరంతరం రివ్యూలు చేస్తున్నాయి. వైరస్ బారిన పడకుడదన్న లక్ష్యంతో.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాయి. చేతులెత్తి దండం పెట్టి మరీ.. లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలని ప్రధాని మోదీ.. సీఎంలు కేసీఆర్, జగన్ ప్రజలకు మరీ మరీ అప్పీల్ చేశారు. మరి మీరు చేస్తున్నదేంటి..?
లాక్‌డౌన్ నేపథ్యంలో పోలీసులు 24 గంటలూ రోడ్లపైనే కన్పిస్తున్నారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జనాలు బలాదూర్‌గా తిరగకుండా.. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు పెట్టి కట్టడి చేస్తున్నారు. తెలంగాణ పోలీస్ బాస్ మహేందర్ రెడ్డి.. ఏపీ పోలీస్ బాస్ గౌతం సవాంగ్ మార్గ నిర్దేశంలో పోలీసులు తమ విధుల్ని వంద శాతం నిర్వర్తిస్తున్నారు. వైరస్‌పై సమరంలో పోలీసులకు సహకరించాల్సిన బాధ్యత ప్రజలకు ఉంది.
అటు.. వైద్యో నారాయణో హరి అన్నట్లు.. ఇప్పుడు డాక్టర్లు నిజంగానే దేవులయ్యారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ప్రజలు విచ్చలవిడిగా తిరగడం వల్ల వైరస్ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అప్పుడు వైద్యులకు మనం బర్డన్ ఇచ్చినట్లే అవుతుంది. వైద్యులే జబ్బుపడితే ఇక మనల్ని రక్షించేది ఎవరు చెప్పండి. వైద్యుల్ని రక్షించుకోవాల్సిన కనీస బాధ్యత మనది కాదా?
ఇప్పటికే అమెరికా, ఇటలీ, చైనా దేశాలను కరోనా వైరస్ అతలాకుతంలా చేస్తున్నాయి. అగ్రదేశాలే వైరస్ ధాటికి తట్టుకోలేకపోతున్నాయి. నిత్యం అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. గురువారం ఒక్క రోజే అమెరికాలో 17 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే.. ఎంత ఘోరమైన పరిస్థితి ఉందో చూడండి. మనమూ ఇలాంటి పరిస్థితిలోకి దిగజారితే జరిగే ఉత్పాతాన్ని ఊహించగలమా..? కరోనా నియంత్రణకు మన దేశంలో ప్రభుత్వాలు చేస్తున్న కృషిని ఇప్పటికైనా గుర్తించండి.. సహకరించండి. మీరు చేయాల్సిందల్లా.. సర్కార్ సూచనలను పాటించడమే... వీధుల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ రావొద్దు.. ఇళ్లలో ఉంటేనే శ్రీరామరక్ష. నిరంతరం పరిశుభ్రత పాటించండి.. చేతుల్ని తరచూ శుభ్రం చేసుకోండి. శానిటైజర్లు విరివిగా వాడండి.
మీరొక్క విషయం గుర్తు పెట్టుకోండి. దేశంలో అసలేం జరుగుతోందో అర్థం చేసుకోండి. ప్రభుత్వాలు ఎందుకు లాక్‌డౌన్ లాంటి కఠిన నిర్ణయాలు తీసుకుందో గుర్తించండి. ప్రభుత్వాల కృషికి ప్రజలు సహకరిస్తేనే.. కరోనాను తరిమికొట్టొచ్చు. లేకుంటే మనమే బాధ్యులం.. బాధితులం అవుతాం. ఇటలీ, అమెరికా, చైనా లాంటి పరిస్థితి కావాలా..? స్వచ్ఛమైన భారతావని కావాలా? ఒక్కసారి ఆలోచించండి. అన్నట్లు.. లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంట్లో నిత్యావసరాలను పొదుపుగా వాడుకోండి. ఉన్నవాటితో సర్దుకోండి. లాక్‌డౌన్ నుంచి రిలాక్సేషన్ ఇచ్చిన సమయంలో షికార్లు కొట్టడం సరికాదు.. అలా చేస్తే.. కరోనాను మనమే ఆహ్వానించినవారం అవుతాం.. కరోనాకు దూరంగా ఉందామా.. లేక ఇంట్లోకి తెద్దామా.. మీరే ఆలోచించండి. దేశంలో కరోనా ఇప్పటికి రెండో స్టేజ్‌లో ఉంది.. మీ చర్యలతో మూడో స్టేజ్‌లోకి వస్తే.. ఆ దేవుడు కూడా కాపాడలేడు. ముంచినా మీరే.. తేల్చినా మీరే.. ప్లీజ్ స్టే హోమ్.. స్టే సేఫ్.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com