కరోనాపై పోరాటానికి మేము సైతమంటున్న భారత సైన్యం

కరోనాపై పోరాటానికి మేము సైతమంటున్న భారత సైన్యం

కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు భారత సైన్యం సిద్ధమంటోంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు, పౌర సమాజాలు సాగిస్తున్న పోరాటంలో మేముసైతం.. భాగస్వాములం అవుతామని ఆర్మీ అంటోంది. కోవిడ్‌ రోగంపై సమరంలో ప్రభుత్వానికి సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ సవరణే ప్రకటించారు.

ఆపరేషన్ నమస్తే.. కరోనా వైరస్‌పై సమరానికి సైన్యం పెట్టుకున్న పేరు ఇది. ఆపరేషన్ నమస్తే పేరుతో కోవిడ్‌పై పోరాటంలో పాల్గొంటామని చెప్తున్నారు. గతంలో భారత సైన్యం చేపట్టిన అన్ని ఆపరేషన్లలో విజయం సాధించామని.. కరోనాపైన విక్టరీ సాధిస్తామని ఆర్మీ చీఫ్ ఆశాభావం వ్యక్తంచేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే ఎనిమిది క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆయన గుర్తుచేశారు.

సరిహద్దుల దగ్గర కాపలా కాస్తున్న సైనికులు.. తమ కుటుంబసభ్యుల ఆరోగ్య పరిస్థితుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఆర్మీ చీఫ్ జనరల్ సవరణే. వారి గురించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని భరోసా ఇచ్చారాయన. సైనిక కుటుంబాలకు ఏదైనా సమస్య తలెత్తితే.. దగ్గర్లోని ఆర్మీ క్యాంపుని సంప్రదించాలని సూచించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వాలకు, అధికారులకు సాయం చేయడం తమ బాధ్యత అని ఆర్మీ చీఫ్‌ అన్నారు.

కరోనా నుంచి మనల్ని మనం రక్షించుకోగలిగినప్పుడే తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించగలమని ఆర్మీ చీఫ్ అన్నారు. స్వీయ రక్షణ కోసం జవాన్లకు పలు సూచనలు చేశారు. ఇలాంటి ఆపత్కాల సమయంలో జవాన్లు తమ సెలవులు రద్దు చేసుకోవాలని.. ఇది కొంత ఇబ్బందిగానే ఉంటుందని అన్నారు. 2001-02 ఏడాదిలో జరిగిన ఆపరేషన్ పరాక్రమ్ సమయంలో.. 8 నెలలపాటు జవాన్లు సెలవు పెట్టలేదని గుర్తుచేశారు.

Tags

Next Story