అధికారంతో సంబంధం లేకుండా ప్రజలతో ఉన్నాం: చంద్రబాబు

అధికారంతో సంబంధం లేకుండా ప్రజలతో ఉన్నాం: చంద్రబాబు

టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా .. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా పార్టీ కార్యకర్తలు, అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. దీనితో పాటు, కరోనా గురించి కూడా ప్రస్తావించిన చంద్రబాబు ఆవిర్భావ దినోత్సవాన్ని ఇళ్ళలోనే జరుపుకోవాలని.. ఇళ్ళపై పార్టీ జెండాలను ఎగురవేసి.. ఎన్టీఆర్ చిత్రపటాల వద్ద నివాళులర్పించాలని సూచించారు. 38 ఏళ్లలో నెలకొన్న పరిణామాల గురించి బాబు గుర్తుచేశారు.

పార్టీ ఆవిర్భావం రోజున కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, పొట్టి శ్రీరాములు, అంబేద్కర్ మహాశయుల స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని స్వర్గీయ నందమూరి తారకరామారావుగారు అన్నారని తెలిపారు. ఆ మహానుభావుల ఆశయాలకు అనుగుణంగానే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలను రాజ్యాధికారంలో భాగస్వాములను చేసింది టీడీపీయేనని.. 'సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు' అన్న పార్టీ సిద్ధాంతాన్ని ఏరోజూ మరువకుండా నిరంతరం ప్రజలతో మమేకమైందని ట్వీటర్ ద్వారా తెలిపారు.

అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రజలకు అండగా నిలుస్తూ వచ్చాము అని గుర్తుచేశారు. ఉత్తరాఖండ్ వరదలు, హుద్ హుద్, తిత్లీ తుఫానులు వంటి ఎన్నో విపత్తుల్లో ప్రజానీకానికి అండగా నిలిచామని అన్నారు. అదే స్ఫూర్తితో ప్రస్తుత కరోనా విపత్తులోనూ ప్రజలకు అండగా నిలవాలని.. వారిలో ధైర్యం నింపాలి. ఎన్టీఆర్ ఆశయ సాధనకు పునరంకితం అవ్వాలని ట్విట్టర్ వేదికగా చంద్రబాబు పిలుపునిచ్చారు.

Tags

Next Story