ప్రతి కుటుంబానికి పది వేలు ఆర్థిక సాయం చేయాలి: సీపీఐ రామకృష్ణ
ఏపీలో తొలగించిన కార్డు దారులకు కూడా కరోనా విపత్తు కారణంగా పంపిణీ చేస్తున్న రేషన్ ఇవ్వాలని చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. సీఎం జగన్మోహాన్ రెడ్డికి లేఖ రాసిన రామకృష్ణ.. రేషన్ డిపోల వద్ద ప్రజలకు పలు సమస్యలు ఎదురవుతున్నాయని తెలియజేశారు. వందల సంఖ్యలో రేషన్ దార్లు క్యూలైన్లో ఉంటున్నారని.. ఇది చాల ప్రమాదకరమని రామకృష్ణ లేఖ లో తెలిపారు.
వలంటీర్ల ద్వారా రేషన్ ఇంటింటికి సరఫరా చేయాలని.. లేకపోతె ప్రతి కార్డుదారునికి రేషన్ ఇచ్చే తేదీ, సమయం కేటాయించి, వలంటీర్ల ద్వారా ఇంటింటికీ టోకెన్ ఇప్పించడం ద్వారా రద్దీని నివారించవచ్చని రామకృష్ణ సూచించారు. ప్రతినెలా ఇచ్చే 5 కేజీల బియ్యంతో పాటు కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ఇస్తామన్న10 కేజీల బియ్యం కూడా అదనంగా పంపిణీ చేయాలన్నారు. బియ్యం, కందిపప్పుతోపాటు ఆయిల్, చింతపండు, పంచదార, ఉల్లిపాయల వంటి ఇతర నిత్యావసర సరుకులు ఉచితంగా అందించాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన వెయ్యి రూపాయలను రు.10 వేలకు పెంచాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com