కరోనా కలకలం.. 26 వేల మందిని క్వారంటైన్‌కి పంపిన విందు

మధ్యప్రదేశ్‌లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఓ వ్యక్తి తన తల్లి సంస్మరణార్థం నిర్వహించిన దశ దినకర్మ కార్యక్రమం.. వేల మందిని ప్రమాదంలోకి నెట్టింది. మురేనా నగరానికి చెందిన ఓ వ్యక్తి దుబాయ్‌లోని ఓ హోటల్‌లో వెయిటర్‌గా పనిచేసేవాడు. తల్లి మరణించడంతో మార్చి 17న అతడు స్వస్థలానికి వచ్చాడు. ఆమె మృతికి సంతాపంగా సంప్రదాయం ప్రకారం 20న విందు ఏర్పాటుచేశాడు. కరోనా విజృంభిస్తున్న సమయంలో దాదాపు 1,200 మంది విందుకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 10 మందికి కరోనా సోకింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ కార్యక్రమానికి హాజరైనవారు, వారి కుటుంబీకులు, సన్నిహితులను కలిపి మొత్తం 26 వేల మందిని హోం క్వారంటైన్‌లో ఉంచారు.
అయితే విందు ఇచ్చిన వ్యక్తి దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన విషయాన్ని అధికారుల వద్ద దాచాడు. మార్చి 27న భార్యతోపాటు తనకూ అనారోగ్యం రావడంతో హాస్పటల్‌కి వెళ్లారు. కరోనాగా అనుమానించిన వైద్యులు శాంపిళ్లను సేకరించి వారిని ఐసోలేషన్ ఉంచారు. దంపతులిద్దరూ ఈ నెల 2న కొవిడ్ పాజిటివ్‌గా తేలారు. దీంతో తాను దుబాయ్ నుంచి వచ్చినట్లు అధికారులకు తెలిపాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com